పెండ్లి ఇంటిలో విషాదం.. షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

25-11-2026 | 05:59pm

భైంసా, నవంబర్ 25 (విజయక్రాంతి): కూతురి పెళ్లి కోసం ఎంతో కష్టపడి దాచుకున్న డబ్బు, విలువైన వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. బాసర మండల కేంద్రంలోని రవీంద్రపూర్ కాలనీలో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ (Short Circuit) కారణంగా షేక్ ఇబ్రహీం ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది.

ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న రూ.10 లక్షల నగదు, నాలుగు తులాల బంగారం, వెండి ఆభరణాలతో పాటు విలువైన వస్తువులు కాలి బూడిదయ్యాయి. కూతురి వివాహం కోసం ఎంతో కష్టపడి సమకూర్చుకున్న ఫర్నిచర్, కొత్త బట్టలు, పెళ్లి సామగ్రి మంటలకు ఆహుతయ్యాయి. టీవీ, పాస్‌పోర్టు, పిల్లల విద్యా ధ్రువపత్రాలు, ఇతర ముఖ్యమైన పత్రాలు సైతం కాలిపోయాయి. దీంతో బాధితుడు ఇబ్రహీం కన్నీరుమున్నీరయ్యారు.

ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది (Fire Services) ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న బాసర సీఐ దీపక్, సర్పంచ్ వెంకటేష్ గౌడ్ ఘటనాస్థలాన్ని పరిశీలించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

తహశీల్దార్ పవన్ చంద్ర ఆదేశాల మేరకు ఆర్ఐ అభిమన్యు, జీపీఓ శంకర్ అక్కడికి చేరుకుని అగ్నిప్రమాదంలో జరిగిన నష్టాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా అవసరమైన సహాయం (Government Assistance) అందించి ఆదుకుంటామని తహశీల్దార్ హామీ ఇచ్చారు. కూతురి పెళ్లి కోసం దాచుకున్న సొమ్ము, సామగ్రి కళ్లముందే బూడిద కావడంతో బాధిత కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

మరిన్ని వార్తలు