సీసీ కెమెరాలను ప్రారంభించిన ఎస్పీ జానకి షర్మిల
నిర్మల్, నవంబర్ 28 (విజయక్రాంతి): నేరాల నియంత్రణతో పాటు గ్రామంలో ప్రజల భద్రతకు సీసీ కెమెరాలు (CCTV Cameras) ఎంతగానో ఉపయోగపడతాయని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. లక్ష్మణచాంద మండలం చామన్‌పల్లి గ్రామంలో ప్రజల భాగస్వామ్యంతో సుమారు రూ.1.20 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను శనివారం ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గ్రామంలో ఏవైనా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుంటే నిందితులను గుర్తించేందుకు, నేరాలను అరికట్టేందుకు కెమెరాలు దోహదపడతాయని తెలిపారు. అనంతరం గ్రామస్తులకు సైబర్ నేరాలపై (Cyber Crimes) అవగాహన కల్పించారు. గుర్తుతెలియని వ్యక్తులకు ఓటీపీలు (OTP), బ్యాంకు ఖాతాల వివరాలు వెల్లడించవద్దని సూచించారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలను భద్రంగా ఉంచుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, సోన్ సీఐ గోవర్ధన్ రెడ్డి, ఎస్సై శ్రావణి, గ్రామ సర్పంచ్ లక్ష్మీ సుదర్శన్, ఉపసర్పంచ్ గంగారెడ్డి, మాజీ సర్పంచ్ గంగాధర్, గ్రామస్తులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.