ఊటుపల్లిలో బైపాస్ సీసీ రోడ్డు నిర్మించాలి

20-09-2026 | 02:54pm

గ్రామ ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గం కల్పించాలని వినతి

బోధన్, సెప్టెంబరు 20 (విజయ క్రాంతి): బోధన్ మండలంలోని ఊటుపల్లి గ్రామంలో జయసుధ ఇంటి నుంచి ప్రభుత్వ పాఠశాల (Government school)వరకు సీసీ రోడ్డు నిర్మించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఈ మార్గంలో సీసీ రోడ్డు నిర్మిస్తే గ్రామానికి మరో ప్రత్యామ్నాయ మార్గం అందుబాటులోకి వస్తుందని, గ్రామంలో ఏదైనా కార్యక్రమం లేదా ఇతర కారణాలతో ప్రధాన రహదారిపై రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడినప్పుడు బైపాస్ మార్గంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

ఈ విషయంపై గ్రామ సర్పంచ్‌కు వినతిపత్రం అందజేసినట్లు గ్రామ మాజీ గ్రామపంచాయతీ కోఆప్షన్ సభ్యుడు సంతోష్ కుమార్ తెలిపారు. గతంలో ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించి కొన్ని వివాదాలు, సున్నితమైన అంశాలు ఉన్నప్పటికీ, ప్రస్తుతం వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.

ప్రజల రాకపోకలకు ఉపయోగకరంగా ఉండే ఈ మార్గంలో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని సర్పంచ్‌ను కోరినట్లు తెలిపారు. ముఖ్యంగా గ్రామపంచాయతీ ఖాతాలో అందుబాటులో ఉన్న రాష్ట్ర ఆర్థిక సంఘం (SFC) నిధులను వినియోగించి రహదారిని సీసీ రోడ్డుగా అభివృద్ధి చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

రోడ్డు నిర్మాణం పూర్తయితే గ్రామంలోని అంతర్గత రహదారులపై రాకపోకల ఒత్తిడి తగ్గడంతో పాటు, అత్యవసర సమయాల్లో మరో మార్గం అందుబాటులో ఉంటుందని గ్రామస్తులు పేర్కొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు, గ్రామపంచాయతీ పాలకవర్గం స్పందించి సీసీ రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు