ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెర.. కొత్త రేషన్ కార్డుల పంపిణీ
పేద కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలతో మరింత భరోసా
మంత్రి శ్రీధర్ బాబు కృషికి చిన్న హోదాల ప్రజల కృతజ్ఞతలు
మంథని,సెప్టెంబర్16(విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా మంథని(Manthani) మండలం చిన్న హోదాల గ్రామంలో బుధవారం కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఎన్నో ఏళ్లుగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన కుటుంబాలకు రేషన్ కార్డులు అందడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు.
వివాహం చేసుకుని కుటుంబాలు ఏర్పరుచుకున్నప్పటికీ, తమ కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు లేకపోవడంతో అనేకమంది పేదలు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమయ్యారని గ్రామస్థులు తెలిపారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూసినా తమకు కార్డులు అందలేదని పేర్కొన్నారు.ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని గ్రామస్థులు తెలిపారు. ముఖ్యంగా ప్రతి పేద కుటుంబం సన్నబియ్యం పొందాలనే సదుద్దేశంతో రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.కొత్త రేషన్ కార్డు ద్వారా రేషన్ సరుకులు పొందడంతో పాటు అర్హతను బట్టి పలు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందే అవకాశం ఉండటంతో లబ్ధిదారులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.
ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న తమకు కొత్త రేషన్ కార్డులు అందించినందుకు రాష్ట్ర మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర ప్రభుత్వానికి చిన్న హోదాల గ్రామ ప్రజలు, పాలకవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాగుల శారద రాజయ్య, వార్డు సభ్యులు దువ్వాసి సదయ్య, వేముల సమత, మంథని లావణ్య, పల్లె హర్షణ, జీపీఓ నూకల శంకర్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, రేషన్ కార్డు లబ్ధిదారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.