మంథనిలో భక్తిశ్రద్ధలతో గణపతి హోమం
మంథని, సెప్టెంబర్ 16 (విజయ క్రాంతి): గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మంథని పట్టణంలోని తమ్మిచెరువు కట్ట వీధిలో గణపతి హోమం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహావాది జలజ–సత్యనారాయణ దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
చతుర్థి దీక్ష చేపట్టిన భక్తులు దీక్ష విరమణ అనంతరం శాస్త్రోక్తంగా ఉద్యాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భక్తులు గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.
మంథని పట్టణంలోని తమ్మిచెరువు కట్ట వీధిలో ఉన్న అతి పురాతన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ, శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు మహావాది దయానంద్ తెలిపారు.
ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దయానంద్ నేతృత్వంలో గత మూడు సంవత్సరాలుగా ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు విశేషంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఆలయ అభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ భక్తులకు మరింత ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.