పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యత

06-10-2026 | 12:12pm

ఆదర్శ పాఠశాలల్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలి

మరమ్మతు పనులను వెంటనే చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలి

విద్యార్థులు క్రీడల్లో పాల్గొనేలా గ్రౌండ్ లెవెలింగ్ పనులు పూర్తి చేయాలి

పాఠశాల ఆవరణలో పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలి

అమ్మ ఆదర్శ పాఠశాల గ్రాంట్‌ ద్వారా అవసరమైన నిధులు అందిస్తాం

గర్రెపల్లి తెలంగాణ మోడల్ స్కూల్, కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

సుల్తానాబాద్, అక్టోబర్ 06 (విజయ క్రాంతి): ఆదర్శ పాఠశాలల్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు, మంగళవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి తెలంగాణ మోడల్ స్కూల్(Telangana Model School), కళాశాలను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష(Collector Koya Sri Harsha) ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న వసతులు, హాస్టల్ సౌకర్యాలు, విద్యుత్‌ వ్యవస్థ, పాఠశాల పరిసరాలు, క్రీడా మైదానం తదితర అంశాలను  పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ... ఆదర్శ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పాఠశాల, బాలికల హాస్టల్‌లో అవసరమైన మరమ్మతు పనులను గుర్తించి వెంటనే చేపట్టాలని ఆదేశించారు. బాలికల హాస్టల్‌లో కొన్ని గదులకు తలుపులు సరిగా లేవని, పాఠశాలలో విద్యుత్ వైరింగ్‌కు సంబంధించిన సమస్యలు ఉన్నాయని, వీటితో పాటు ఇతర మరమ్మతు పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అవసరమైన మరమ్మతు పనులకు అమ్మ ఆదర్శ పాఠశాల గ్రాంట్ కింద నిధులను వెంటనే అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

విద్యార్థులు క్రీడల్లో చురుకుగా పాల్గొనేలా పాఠశాల క్రీడా మైదానాన్ని అభివృద్ధి చేయాలని  సూచించారు. మైదానంలో అవసరమైన గ్రౌండ్ లెవెలింగ్ పనులను పూర్తి చేసి, విద్యార్థులు క్రీడలు ఆడేందుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలని ఆదేశించారు.పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలు లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరిచేలా చర్యలు తీసుకోవాలని  సూచించారు. విద్యార్థులకు పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా పాఠశాల పరిసరాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.

పాఠశాల, బాలిక హాస్టల్‌లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ, గుర్తించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. గత విద్యా సంవత్సరంలో పదవతరగతిలో 100 శాతం ఫలితాలు సాధించడంతో పాటు ఇంటర్మీడియట్ ఫలితాలు జిల్లా స్థాయిలో మెరుగైన ఫలితాలు సాధించినందుకు ప్రిన్సిపాల్ ,ఉపాధ్యాయులను మరియు విద్యార్థులను అభినందించారు,ఈ పర్యటనలో తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ గోల్డీ బుల్బీ కౌర్, సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు,

మరిన్ని వార్తలు