ముగిసిన ఎస్‌జీఎఫ్ క్రీడా పోటీలు..
విజేతలకు బహుమతులు అందజేసిన మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ
సుల్తానాబాద్, సెప్టెంబరు 29: (విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్(Sultanabad Sports Club) సహకారంతో సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో రెండు రోజులుగా నిర్వహించిన పెద్దపల్లి జిల్లా ఎస్‌జీఎఫ్ వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్ పోటీలు మంగళవారం ఘనంగా ముగిశాయి. పెద్దపల్లి జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.
ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ హాజరై విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. క్రీడలతో శారీరక దారుఢ్యంతోపాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని అన్నారు.
ఎస్‌జీఎఫ్ కార్యదర్శి కనుకుంట్ల లక్ష్మణ్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో వివిధ స్థాయిల్లో పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు తదుపరి స్థాయి పోటీల్లోనూ మెరుగైన ప్రదర్శన కనబరచాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు ముస్త్యాల రవీందర్, నోడల్ ఆఫీసర్ శోభారాణి, జోనల్ కన్వీనర్ దాసరి రమేష్, మండల కన్వీనర్ ప్రణయ్, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు, పీఈటీలు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.