జీహెచ్‌ఎంసీ అసిస్టెంట్ డైరెక్టర్ ఇంట ఏసీబీ సోదాలు

03-11-2026 | 01:52pm

ఉప్పల్, నవంబర్ 3 (విజయ క్రాంతి): జీహెచ్‌ఎంసీ అసిస్టెంట్ డైరెక్టర్ నల్లబోతు యాదగిరిరావుపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మంగళవారం సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు (Disproportionate Assets) కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో హైదరాబాద్‌, సూర్యాపేటలోని ఆయన నివాసాలతో పాటు బంధువుల ఇళ్లలో ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఉప్పల్‌లోని హైకోర్టు కాలనీలో ఉన్న యాదగిరిరావు ఇంటితో పాటు పలు ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు సోదాలు కొనసాగిస్తున్నాయి. డీఎస్పీ (DSP) ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో అధికారులు ఆస్తుల పత్రాలు, బ్యాంకు లావాదేవీలు (Bank Transactions), ఇతర ఆర్థిక వివరాలను పరిశీలిస్తున్నారు.

యాదగిరిరావు, ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లపై ఉన్న ఆస్తుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. సోదాలు పూర్తయిన తర్వాత స్వాధీనం చేసుకున్న పత్రాలు, గుర్తించిన ఆస్తుల వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు