గ్రాడ్యుయేట్ ఓటర్లూ.. ఈ విషయం తెలుసుకోండి!

03-11-2026 | 01:48pm

హైదరాబాద్: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో(Graduate MLC Elections) ఓటు హక్కు నమోదు చేసుకోవాలనుకునే వారికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఊరటనిచ్చింది. ఓటరు నమోదుకు ఈ నెల 6వ తేదీనే చివరి అవకాశంగా భావించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సుదర్శన్ రెడ్డి(Telangana CEO Sudarshan Reddy) స్పష్టం చేశారు. గడువు ముగిసిన తర్వాత కూడా దరఖాస్తులను స్వీకరిస్తామని వెల్లడించారు.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదు(MLC Voter Registration) కోసం తెలంగాణ సీఈవో వెబ్‌సైట్‌(Telangana CEO Website)లో ఆన్‌లైన్ దరఖాస్తులు చేసుకునే సమయంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయి. గత మూడు రోజులుగా దరఖాస్తుల ప్రక్రియకు అంతరాయం ఏర్పడినట్లు సమాచారం. దీంతో గడువులోగా ఓటు నమోదు చేసుకోలేకపోతామేమోనని పలువురు పట్టభద్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీఈవో తాజా ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.

ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నవంబర్ 25న ప్రాథమిక ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు. అదే రోజు నుంచి డిసెంబర్ 10 వరకు ఓటర్ల నుంచి కొత్త దరఖాస్తులు, జాబితాపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. అనంతరం డిసెంబర్ 10న తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు.

తుది ఓటర్ల జాబితా ప్రచురించిన తర్వాత కూడా ఓటు నమోదు కోసం దరఖాస్తులు స్వీకరిస్తామని సుదర్శన్ రెడ్డి తెలిపారు. దీంతో సాంకేతిక సమస్యల కారణంగా దరఖాస్తు చేయలేకపోయిన పట్టభద్రులకు మరింత అవకాశం లభించనుంది. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు