ఎవరెస్ట్‌ వద్ద రెండు హెలికాప్టర్లు ఢీ!

03-11-2026 | 02:08pm

ఫెరిచే: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్‌(Everest) సమీపంలో పెను ప్రమాదం చోటుచేసుకుంది. నేపాల్‌లోని సోలుఖుంబు జిల్లా(Solukhumbu District)లో రెండు హెలికాప్టర్లు ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తుండగా వాటి రోటర్ బ్లేడ్లు పరస్పరం ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఓ భారతీయ పర్యాటకుడు ప్రాణాలు కోల్పోగా(Indian Tourist Killed), మరో వ్యక్తి గాయపడ్డాడు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

సోలుఖుంబు జిల్లాలోని ఫెరిచే ప్రాంతంలో మంగళవారం ఫిష్‌టైల్ ఎయిర్, ఎయిర్ డైనాస్టీ సంస్థలకు చెందిన రెండు హెలికాప్టర్లు ఒకే హెలిప్యాడ్‌పై దిగేందుకు ప్రయత్నించాయి. ఈ క్రమంలో వాటి రోటర్ బ్లేడ్లు ఒకదానికొకటి తగలడంతో ప్రమాదం సంభవించింది.

ఈ ఘటనలో ఓ భారతీయ పర్యాటకుడు మరణించగా, మరో వ్యక్తి గాయాలపాలయ్యాడు. క్షతగాత్రుడిని మెరుగైన వైద్యం కోసం హెలికాప్టర్‌లో లుక్లాకు తరలించారు. ప్రమాదంలో రెండు హెలికాప్టర్ల పైలట్లు మాత్రం సురక్షితంగా బయటపడినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం అనంతరం మంటలు చెలరేగకపోవడంతో మరో పెద్ద ముప్పు తప్పింది.

ఎవరెస్ట్‌ పర్వతారోహణకు వెళ్లే పర్యాటకులు, అధిరోహకులకు ఫెరిచే ప్రాంతం కీలక మార్గంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో పర్యాటకుల రవాణా, అత్యవసర సేవల కోసం హెలికాప్టర్లను విస్తృతంగా వినియోగిస్తుంటారు. ఇలాంటి రద్దీ ప్రాంతంలో రెండు హెలికాప్టర్లు ఢీకొనడం ఆందోళన కలిగిస్తోంది. ప్రమాదానికి అసలు కారణాలు ఏమిటి? ల్యాండింగ్ సమయంలో సమన్వయ లోపం ఏర్పడిందా? అనే కోణాల్లో అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.


మరిన్ని వార్తలు