ధరల సెగపై బీఆర్ఎస్ మహిళల మౌన పోరు!

03-11-2026 | 02:25pm

హైదరాబాద్: పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు(Essential Commodities Price) సామాన్య కుటుంబాల ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేస్తున్నాయంటూ బీఆర్ఎస్ మహిళా విభాగం(BRS Mahila Vibhagam) కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసన గళం వినిపించింది. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో ఎన్టీఆర్ మార్కెట్ నుంచి చౌరస్తా వరకు మౌన ప్రదర్శన నిర్వహించి ప్రజల దృష్టిని ధరల సమస్యపైకి మళ్లించింది.

ఈ కార్యక్రమానికి ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి(LB Nagar MLA Sudheer Reddy) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిరసనలో భాగంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోని నిత్యావసర వస్తువుల ధరలను పోలుస్తూ ప్రత్యేక పట్టికను ప్రదర్శించారు. బియ్యం, వంట నూనె, గ్యాస్ సిలిండర్ నుంచి పాలు, పప్పులు, గుడ్లు, కూరగాయల వరకు పెరిగిన ధరలను ఉదహరిస్తూ తమ ఆందోళనను వ్యక్తం చేశారు.

ఇప్పటికే కుటుంబ ఖర్చులను సమతుల్యం చేసుకోవడం కష్టంగా మారిందని, నిత్యావసరాల ధరల పెరుగుదలతో మధ్యతరగతి, పేద కుటుంబాలపై అదనపు భారం పడుతోందని మహిళా నాయకులు పేర్కొన్నారు. ముఖ్యంగా ఇంటి ఆర్థిక వ్యవహారాలను నిర్వహించే మహిళలకు నెలవారీ బడ్జెట్‌ను నెట్టుకురావడం సవాలుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంతో పాటు నిత్యావసర ధరలను అదుపులోకి తీసుకురావడానికి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రజలకు రాజకీయ హామీలకంటే పెరుగుతున్న ధరల నుంచి తక్షణ ఉపశమనం ముఖ్యమని స్పష్టం చేశారు. ఈ నిరసనలో ఎల్బీనగర్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ మహిళా నేతలు(BRS women leaders), కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు