తెలంగాణ ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలి
ఎల్బీనగర్ కోర్టు ఆవరణలో కాంగ్రెస్ లీగల్ సెల్ ఆందోళన
ఎల్బీనగర్, నవంబర్ 2 : తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, గద్దర్ కుటుంబాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) క్షమాపణ చెప్పాలి టీ పీసీసీ లీగల్ సెల్ నాయకులు డిమాండ్ చేశారు. అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఎల్బీనగర్ లోని రంగారెడ్డి జిల్లా కోర్టు ఆవరణలో ఆందోళన చేపట్టి, అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. టీ పీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ అడ్వకేట్ మదుపు శశికాంత్ మాట్లాడుతూ...
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ అస్తిత్వం పట్ల ప్రతి ఒక్కరూ గౌరవం కలిగి ఉండాలన్నారు. తెలంగాణ ప్రజల గౌరవానికి భంగం కలిగించే వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని గౌరవిస్తూ అమిత్ షా వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీ పీసీసీ లీగల్ సెల్ నాయకులు నల్లగాటి రాంబాబు, ఆకుల సత్యనారాయణ, జక్కుల వెంకటేష్, పీఆర్వీ ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు పన్యాల జైపాల్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, నరేందర్, అస్లాం, భాను తదితరులు పాల్గొన్నారు.