తుర్కయంజాల్ లో నాలా కబ్జాపై హైడ్రా కొరడా

04-11-2026 | 02:55pm
  1. జేసీబీతో నాలా పూడికతీత
  2. సర్వే నంబర్ 324లోనీ ప్రభుత్వ భూమికి హద్దులు నిర్ణయించాలని తహసీల్దార్‌కు ఆదేశాలు

ఆదిభట్ల అక్టోబర్ 4 (విజయ క్రాంతి ): ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని తుర్కయంజాల్ డివిజన్‌లో(Turkayamjal Division) ప్రభుత్వ భూములు, నాలాల ఆక్రమణలపై హైడ్రా అధికారులు చర్యలు చేపట్టారు. సర్వే నంబర్ 324లోని ఏడు గుంటల ప్రభుత్వ భూమిని కబ్జా చేయడంతో పాటు, 1972 ట్రోపో షీట్ ప్రభుత్వ రికార్డుల ప్రకారం సర్వే నంబర్ 325లో ఉన్న నాలాను కొందరు వ్యక్తులు ఆక్రమించినట్లు శ్రీశ్రీ విహార్ వెల్ఫేర్ అసోసియేషన్(Sri Sri Vihar Welfare Association), గంగాధర కాలనీ, కేఎస్ఆర్ కాలనీ సభ్యులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు.

కాలనీవాసుల ఫిర్యాదుపై స్పందించిన హైడ్రా సీఐ సైదులు, ఇరిగేషన్ ఏఈ భాగ్యలక్ష్మి, హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఆక్రమణకు గురైన నాలాను జేసీబీ సహాయంతో పూడికతీత పనులు చేపట్టారు. అదేవిధంగా సర్వే నంబర్ 324లోని ఏడు గుంటల ప్రభుత్వ భూమికి హద్దులు నిర్ధారించాలని అబ్దుల్లాపూర్‌మెట్ మండల తహసీల్దార్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ నాలా ఆక్రమణల కారణంగా వర్షాకాలంలో వర్షపు నీరు సక్రమంగా వెళ్లక కాలనీల్లోకి చేరుతోందని, డ్రైనేజీలు పొంగిపొర్లుతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వర్షాలు కురిసినప్పుడు పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని తెలిపారు. తమ ఫిర్యాదుపై తక్షణమే స్పందించి నాలా పూడికతీత చేపట్టడంతో పాటు ప్రభుత్వ భూమికి హద్దులు నిర్ణయించేలా చర్యలు తీసుకున్న హైడ్రా అధికారులపై కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు