రేడియల్ రోడ్డు ముసుగులో మట్టి దోపిడీ!?

24-11-2026 | 05:35am

యంత్రాంగం మౌనంపై అనుమానాలు

అనుమతులే లేవు.. లక్షల టన్నుల మట్టి మాయం

సబ్ కాంట్రాక్ట్ పేరుతో ప్రైవేటుకు తరలింపు.. భూముల చదును పేరిట అసైన్డ్ భూముల్లో తవ్వకాలకు సిఫారసు

రంగారెడ్డి బ్యూరో, నవంబర్ 23 (విజయక్రాంతి): క్షేత్రస్థాయిలో అనుమతులు రాకముందే పెద్ద ఎత్తున మట్టి తవ్వకాలు(Soil excavation).. నిబంధనలు పట్టనట్టు సాగుతున్న రవాణా.. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ ప్రైవేటు అవసరాలకు మట్టిని తరలిస్తున్నారన్న తీవ్ర ఆరోపణలు. రంగారెడ్డి జిల్లాలో(Ranga Reddy District) ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రేడియల్ రోడ్డు(Radial Road Project) (రతన్ టాటా గ్రీన్ ఫీల్ రోడ్డు) రెండో దశ పనుల మాటున మట్టి దోపిడీ జోరుగా సాగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

హైదరాబాద్ మహానగరానికి దక్షిణ సరిహద్దులో రవాణా వ్యవస్థను(Transport system) ఆధునీకరించేలా, భవిష్యత్తులో అభివృద్ధి చేస్తున్న ఫ్యూచర్ సిటీని(Future City) అనుసంధానించేలా ఈ గ్రీన్ ఫీల్ రహదారిని నిర్మిస్తున్నారు. మీరాఖాన్పేట నుంచి ఆమనగల్లు సమీపంలోని ఆకుతోటపల్లి వద్ద ఉన్న ట్రిపుల్ ఆర్  జంక్షన్ వరకు సుమారు 21 కిలోమీటర్ల మేర రెండో దశ పనులు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఆకుతోటపల్లి ప్రాంతంలో పనులు మొదలవగా, మట్టి తరలింపు వ్యవహారంలోనే గందరగోళం నెలకొంది.

సబ్ కాంట్రాక్ట్.. పక్కదారి..

రెండో దశ పనుల కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థ మట్టి తవ్వకాలను సబ్ కాంట్రాక్ట్ కింద పలు సంస్థలకు అప్పగించింది. అవి కూడా రెండు, మూడు కిలోమీటర్ల చొప్పున విభజించి స్థానిక నేతలకు అప్పగించినట్లు సమాచారం. రేడియల్ రోడ్డు పనుల కోసమంటూ మట్టిని తవ్వి, ప్రైవేటు వెంచర్లు, ఇతర నిర్మాణాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నా యి. ప్రభుత్వ భూములతో పాటు అసైన్డ్ భూముల్లోనూ తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు.

ఇటీవల కడ్తాల్ మండలంలో అక్రమ తవ్వకాలపై ఫిర్యాదు రావడంతో తహసీల్దార్ అడ్డుకున్నారు. ఆమనగల్లు సాకిబండ తండా సర్వే నంబర్ 201లోనూ ఇదే తరహా ఆరోపణలపై ఆందోళనలు తలెత్తగా, ఆకుతోటపల్లి సర్వే నంబర్ 304లో బ్లాస్టింగ్, మట్టి తరలింపు పనులపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

భూముల చదును పేరిట సిఫారసు..

మరోవైపు, ఆకుతోటపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 304లో ఉన్న ప్రభుత్వ, అసైన్డ్ భూముల్లో మట్టి తవ్వకాలకు (ఆర్‌ఎస్‌ఎస్‌ఆర్ కన్స్ట్రక్షన్ సబ్ కాంట్రాక్ట్ సంస్థకు) అనుమతులు ఇవ్వాలంటూ కందుకూరు ఆర్డీవో జిల్లా మైనింగ్ ఏడీకి చేసిన సిఫారసు లేఖ చర్చనీయాంశమైంది. రైతుల భూములను చదును చేసే ఉద్దేశంతోనే అసైన్డ్ భూముల్లో తవ్వకాల కోసం సిఫారసు చేశామని కందుకూరు ఆర్డీవో జగదీశ్వర్ తెలిపారు.

అయితే, పొలాల చదును పేరిట అసైన్డ్ భూముల్లో తవ్వకాలకు సిఫారసు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్థానికంగా కొందరు ప్రజాప్రతినిధులు, సర్పంచుల సహకారంతో, ఎకరానికి రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు రైతులకు ముట్టజెప్పి నోటిమాట అనుమతులతో మట్టి తవ్వుతున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

సీనరేజ్ కట్టలేదు.. రాయల్టీ వస్తోంది..

రోడ్డు నిర్మాణ సంస్థ రాష్ట్ర స్థాయిలో అనుమతులు తీసుకున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో రెవెన్యూ, మైనింగ్ శాఖల నుంచి అనుమతులు తప్పనిసరి. ముందస్తుగా సీనరేజ్ చెల్లించి పర్మిట్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఇప్పటివరకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని, ముందస్తు సీనరేజ్ చెల్లిస్తేనే పరిశీలిస్తామని మైనింగ్ ఏడీ నర్సిరెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్  నుంచి మైనింగ్ శాఖకు రాయల్టీ వస్తోందని, రెండో దశకు సంబంధించి ఇప్పటివరకు సుమారు రూ.7 కోట్ల వరకు సమకూరిందని అధికారులు చెబుతున్నారు.

యంత్రాంగం కదిలేదెప్పుడు?

రాయల్టీ వస్తోంది కదా అన్న ధోరణితో మైనింగ్, రెవెన్యూ శాఖలుమిన్నకుండిపోతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. హెచ్‌ఎండీఏ, హెచ్‌ఏసీఎల్,  టీజీఐఐసీ అధికారులు నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్నారని, రాత్రింబవళ్లు ఆమనగల్లు, కడ్తాల్, కందుకూరు మండలాల్లోని పలు గ్రామాలు, తండాల మీదుగా టిప్పర్లు దూసుకుపోతున్నా అడ్డుకునే వారు లేరని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి, అనుమతులు లేని తవ్వకాలు, పక్కదారి పడుతున్న మట్టి రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, ప్రజానీకం డిమాండ్ చేస్తున్నారు

మరిన్ని వార్తలు