నీళ్లు వృథా చేస్తే కఠిన చర్యలు
- ట్యాంకర్లకు లీకేజీలు ఉండొద్దు
- ఉంటే మొదటిసారి రూ.5 వేల జరిమానా
- రెండోసారి ట్యాంకర్ రిజిస్ట్రేషన్ శాశ్వతంగా రద్దు
- హైదరాబాద్‌లో నవంబర్ 1 నుంచి అమలులోకి
- నీటి వృథాపై జలమండలి ఉక్కుపాదం
- పట్టణంలో జీహెచ్‌ఎంసీ ప్రత్యేక డ్రైవ్
- ప్రజలు పొదుపు చర్యలు పాటించాలి
- జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 24 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలో(Hyderabad City) రోజురోజుకూ పెరుగుతున్న నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ నీటిపారుదల, మంచినీటి సరఫరా మండలి(Water Supply Board) (హైదరాబాద్ వాటర్ వర్క్స్/ జలమండలి) అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. నీటిని వృథా చేసే వారిపై ఏమాత్రం ఉపేక్షించకూడదని నిర్ణయించినట్లు జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్‌రెడ్డి వెల్లడించారు.
నగర ప్రజలు నీటి ప్రాధాన్యతను గుర్తించి, ప్రతీ చుక్కను పొదుపుగా వాడుకోవాలని ఆయన సూచించారు. నీటి వృథాను అరికట్టేందుకు జలమండలి ప్రతిపాదించిన నూతన నిబంధనలు నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
ట్యాంకర్ల ద్వారా నీటిని తరలించే క్రమంలో లీకేజీలు ఉండి నీటిని వృథా చేస్తే మొదటిసారి రూ.5 వేల జరిమానా విధిస్తారు. ఇదే తప్పు రెండోసారి పునరావృతమైతే ఆ ట్యాంకర్ రిజిస్ట్రేషన్‌ను శాశ్వతంగా రద్దు చేస్తారు. వాటర్ ట్యాంకర్లలో లీకేజీలు ఉన్నా లేదా సరియైన మూతలు లేకపోయినా వాటర్ ఫిల్లింగ్ స్టేషన్లలో నీటిని నింపడానికి ఇక నుంచి అనుమతించరు.
ఇళ్ల వద్ద వృథా చేస్తే చర్యలు
నగర ప్రజలు తమ ఇంటి వద్ద వద్ద హోజ్ పైపులతో కార్లు, బైక్‌లు కడగడం, రోడ్లపై నీళ్లు చల్లడం వంటి చర్యలకు పాల్పడితే భారీ జరిమానాలు విధించడమే కాకుండా బోర్ మోటార్లను కూడా సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు. జీహెచ్‌ఎంసీ అధికారులు ఉదయం సాయంత్రం వెళల్లో ప్రత్యేక డ్రైవులు చేపట్టి నిబంధనలు ఉల్లంఘించే వారిపై భారీగా జరిమానాలు విధించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
డెడ్ స్టోరేజీకి రిజర్వాయర్లు
నగర తాగునీటి అవసరాలను తీర్చే ప్రధాన నీటి వనరులైన సింగూరు, మంజీరా రిజర్వాయర్లలో నీటి మట్టాలు అడుగంటిపోయి ప్రస్తుతం ‘డెడ్ స్టోరేజ్’ స్థాయికి చేరుకున్నాయి. ఈ ఏడాది వర్షాకాలంలో తగినంత వర్షపాతం నమోదు కాకపోవడం, అంతకంతకూ భూగర్భ జలాలు పడిపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని అధికారులు తెలిపారు. ఇదే పరిస్థితి కొనసాగితే డిసెంబర్ 15 నాటికి నగరంలో తీవ్రమైన నీటి కటకట ఏర్పడే ప్రమాదం ఉందని జలమండలి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రజలు పోదువు చర్యలు పాటించాలి
రాబోయే తీవ్రమైన నీటి ఎద్దడిని తట్టుకోవడానికి ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా నీటిని ఆదా చేయాలని జలమండలి కోరింది. వర్షపు నీటి నిల్వ ప్రతి నివాస గృహం, అపార్ట్‌మెంట్‌లో వర్షపు నీటి నిల్వ గుంతలు (రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్) ఏర్పాటు చేసుకుని భూగర్భ జలాలను పెంపొందించాలి. బట్టలు ఉతికిన నీరు, గిన్నెలు కడిగిన నీటిని (సింక్ నీరు మినహా) తోట పనికి, టాయిలెట్ ఫ్లషింగ్‌కు ఉపయోగించాలి.
ఇళ్లలోని కుళాయిలు, పైపులైన్లలో ఎక్కడైనా లీకేజీలు ఉంటే వెంటనే మరమ్మతులు చేయించాలి. వాహనాలను కడిగేందుకు హోజ్ పైపులకు బదులుగా బకెట్, తడి గుడ్డను వాడటం ద్వారా దాదాపు 70 శాతం నీటిని ఆదా చేయవచ్చు.