కలిసిరాని కాలానికి నడిచొస్తున్న డిమాండ్!
- పలు పంట ఉత్పత్తులకు రికార్డు స్థాయిలో ధరలు
- ఎల్ నినోతో తగ్గిన దిగుబడులు.. పెరిగిన డిమాండ్
మద్దతు ధర కంటే బహిరంగ మార్కెట్లో మెరుగైన ధరలు.. ప్రభుత్వ కొనుగోళ్లు ఈసారి లేనట్లే!
మహబూబాబాద్, అక్టోబర్ 2౪ (విజయక్రాంతి) : కలిసొచ్చిన కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడంటారు.. కానీ, ఎల్ నినో(Amid El Niño) ప్రభావంతో కలిసిరాని కాలం వల్ల పంట ఉత్పత్తులకు డిమాండ్ నడిచొస్తున్నది. తెలంగాణలో పంటల సాగు పరిస్థితులు ఈసారి రైతులకు కొత్త అనుభవాన్ని అందిస్తున్నాయి. ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల్లో నేపథ్యంలో 2026 వానాకాలంలో సాగుచేసిన వివిధ రకాల పంట దిగుబడులు ఆశించిన స్థాయిలో లేకపోవడం,
మరోవైపు మార్కెట్లో పంట ఉత్పత్తులకు డిమాండ్ పెరగడంతో పత్తి, మొక్కజొన్న, ధాన్యం, అపరాల ధరలు రైతుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. సాధారణంగా మద్దతు ధరకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్ద పంటను విక్రయించే రైతులు.. ఈసారి బహిరంగ మార్కెట్లో మెరుగైన ధరలు లభిస్తుండటంతో అటువైపే మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా కొనుగోలు కేంద్రాలు తెరిచినా, వాటి అవసరం పెద్దగా కనిపించని పరిస్థితి నెలకొంది.
దిగుబడులు తగ్గినా.. పెరిగిన ధరలు!
వాతావరణ పరిస్థితుల ప్రభావం, వర్షాల తీరులో మార్పులు, పంటల ఎదుగుదలపై ప్రతికూలతలు ఏర్పడి దిగుబడులపై ప్రభావం చూపినట్లు రైతులు చెబుతున్నారు. ఉత్పత్తి తగ్గడంతో మార్కెట్లో పంటలకు డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా పత్తి, మొక్కజొన్న, ధాన్యం, అపరాల విక్రయాల్లో వ్యాపారుల నుంచి పోటీ నెలకొనడంతో రైతులకు మద్దతు ధర కంటే మెరుగైన ధరలు లభించే సందర్భాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కనిపిస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా వానాకాలంలో సాధారణ పంటల సాగు విస్తీర్ణం 1,32,38,446 ఎకరాలు ఉండగా, ఈ వాన కాలంలో 96,74,157 ఎకరాల్లో పంట సాగు జరిగింది. ఇందులో అత్యధికంగా 46.34 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా, 22.49 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, మిగిలిన విస్తీర్ణంలో మొక్కజొన్న,
కంది, పెసర, మినుము, చెరకు, ఇతర పంటలు సాగు చేశారు. ఎల్ నినో కారణంగా ప్రధాన పంటలు పత్తి, వరి, మొక్కజొన్న దిగుబడి గణనీయంగా తగ్గింది. మన దేశంతో పాటు విదేశాల్లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల ఆహార ధాన్యాలకు విపరీతంగా డిమాండ్ ఏర్పడింది. దీనితో ఈ సీజన్ లో పంట ఉత్పత్తులకు విపరీతమైన ధర పెరిగే అవకాశాలున్నట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
వరి పంట కొన్నిచోట్ల కోతకు వస్తుండగా, మద్దతు ధరకు మించి నేరుగా వ్యాపారులే రైతుల పొలం వద్దకే వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. సన్న రకం వరి ధాన్యానికి ప్రభుత్వం 2,400 రూపాయలు మద్దతు ధర తో పాటు 500 రూపాయలు బోనస్ ప్రకటించగా, ప్రస్తుతం పచ్చి ధాన్యానికే వ్యాపారులు క్వింటాలుకు 3,200 నుంచి 3,500 రూపాయల ధర పెడుతున్నారు. ఇక ఇదే తరహాలో పత్తి పంటకు కూడా ఆశించిన ధర లభిస్తోంది.
ప్రభుత్వం పత్తి పంటకు క్వింటాల్ కు గరిష్టంగా సీసీఐ ద్వారా 8,667 రూపాయల మద్దతు ధరతో కొనుగోలు చేస్తుండగా, బహిరంగ మార్కెట్లో వ్యాపారులు 9,200 గరిష్ట ధరకు కొనుగోలు చేస్తున్నారు. అలాగే మక్కజొన్నలకు ప్రభుత్వం 2,410 మద్దతు ధర ప్రకటించగా, మునుపెన్నడూ లేనివిధంగా బహిరంగ మార్కెట్లో ఇప్పుడు క్వింటాలకు 3,000 పైచిలుకు ధర లభిస్తోంది. కందులు, పెసర్లు, మినుములు, బొబ్బర్లు, వేరుశనగ తదితర పంటలకు కూడా మద్దతుకు మించి ధర పెడుతుండడంతో అన్నదాతలకు దిగుబడి తగ్గినా, కాస్త ఉపశమనాన్ని కలిగిస్తోంది.
కొనుగోలు కేంద్రాలు ఉన్నా.. రైతుల చూపు మార్కెట్ వైపే!
ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాలు రైతులకు కనీస మద్దతు ధరకు భరోసా కల్పించాల్సి ఉంటుంది. కానీ బహిరంగ మార్కెట్లోనే అంతకంటే ఎక్కువ ధర లభిస్తే రైతులు అక్కడికే వెళ్లడం సహజం. ఈ క్రమంలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు పంటల రాక తగ్గే పరిస్థితులు ఈసారి ఏర్పడనున్నాయి. దీంతో కొనుగోళ్లు నామమాత్రంగా కొనసాగే అవకాశాలు ఉన్నట్టు చెబుతున్నారు.
ధరల జోరు కొనసాగేనా?
ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ధరలు రైతులకు కొంత ఊరటనిస్తున్నప్పటికీ.. ఈ ధరల జోరు ఎంతకాలం కొనసాగుతుందన్నది కీలకంగా మారింది. డిమాండ్ తగ్గి, మార్కెట్ ధరలు పడిపోయినా రైతులు మళ్లీ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వైపు చూడాల్సి రావచ్చు. అందువల్ల కొనుగోలు కేంద్రాలను కేవలం ప్రారంభించడమే కాకుండా, అవసరమైన సమయంలో తక్షణమే కొనుగోళ్లు చేపట్టేలా యంత్రాంగాన్ని సిద్ధంగా ఉంచాల్సిన అవసరం ఉంది.
రైతుకు మేలు జరిగితేనే పంటకు సార్థకత!
పంటకు మంచి ధర రావడం రైతుకు ఆనందమే. అయితే తగ్గిన దిగుబడుల కారణంగా వచ్చిన అధిక ధరలు మాత్రమే రైతు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తాయని భావించలేం. పెట్టుబడులు, కూలీ ఖర్చులు, ఎరువులు, విత్తనాలు, సాగునీటి వ్యయాలు పెరిగిన నేపథ్యంలో రైతుకు నిజంగా మిగిలే ఆదాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. మార్కెట్లో ధరలు అనుకూలంగా ఉన్నప్పుడు రైతుకు లాభం దక్కేలా చూడటంతోపాటు,
ధరలు పడిపోయినప్పుడు కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసే వ్యవస్థ పటిష్ఠంగా ఉండాలి. దిగుబడులు తగ్గి ధరలు పెరిగిన ప్రస్తుత పరిస్థితి తాత్కాలిక ఉపశమనమేనా.. లేక రైతుకు స్థిరమైన ఆదాయానికి మార్గమా? అన్నది రానున్న రోజుల్లో తేలనుంది. ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలి. పంటకు ధర వచ్చినప్పుడే కాదు.. ధర పడిపోయినప్పుడూ రైతు పక్షాన నిలిచే కొనుగోలు వ్యవస్థే వ్యవసాయానికి నిజమైన భరోసాగా ఉంటుంది.
యాకుబ్ రెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకుడు