జీవదాతగా నిలిచిన ఉపాధ్యాయురాలు
- మరణం తర్వాత అవయవ దానంతో 8 మందికి పునర్జన్మ
- అవయవ దాతల సంఘం జాతీయ కన్వీనర్
- ఎల్వీ కుమార్ కృషితో కుటుంబ సభ్యుల అంగీకారం
ఎల్బీనగర్, అక్టోబర్ 27: వృత్తి జీవితంలో కాకుండా మరణించిన తరువాత కూడా ఓ ఉపాధ్యాయురాలు ఆదర్శంగా నిలిచారు. తాను చనిపోతూ ఎనిమిది మందికి ప్రాణదానం(Donation of life) చేసి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సమాజానికి ఆదర్శంగా నిలిచారు. నల్గొండ జిల్లా కేంద్రానికి చెందిన ఉపాధ్యాయురాలు గొర్రె నీరజ కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ లోని వనస్థలిపురంలో ఉంటున్నారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న నీరజ సోమవారం ఉదయం బ్రెయిన్ డెడ్ కు గురైనట్లు వైద్యుల నిర్ధారించారు.
చైతన్యపురిలో ఉంటున్న అఖిల భారత శరీర, అవయవ దాతల సంఘం జాతీయ కన్వీనర్ ఎల్వీ కుమార్ విషయం తెలుసుకుని మృతురాలి కుటుంబ సభ్యులను సంప్రదించారు. ఈ క్లిష్ట సమయంలో అవయవ దానం ప్రాముఖ్యత, మరొకరికి ప్రాణం పోయడం ద్వారా సమాజంలో ఎలా జీవించి ఉంటారో వారికి వివరించారు.
ఎల్వీకుమార్ విజ్ఞప్తితో స్పందించిన కుటుంబ సభ్యులు, పుట్టెడు దుఃఖంలోనూ మానవత్వంతో ఆలోచించి అవయవ దానానికి ముందుకు వచ్చారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో మంగళవారం మలక్ పేట్ లోని ఓ ఆసుపత్రి వైద్యులు ఆమె శరీరం నుంచి కీలక అవయవాలను సేకరించి, అత్యవసరంగా అవయవ మార్పిడి కోసం ఎదురుచూస్తున్న ఎనిమిది మంది రోగులకు విజయవంతంగా అమర్చారు. తద్వారా ఎనిమిది మంది జీవితాల్లో కొత్త వెలుగులు నింపారు.
ఈ సందర్భంగా ఎల్వీ కుమార్ మాట్లాడుతూ.. కన్నబిడ్డను, తోడబుట్టిన వారిని కోల్పోయిన బాధలోనూ సమాజం కోసం ఆలోచించి, అవయవ దానానికి అంగీకరించిన గొర్రె నీరజ కుటుంబ సభ్యుల నిర్ణయం అత్యంత అభినందనీయమన్నారు. మూఢనమ్మకాలను పక్కనబెట్టి, ప్రతి ఒక్కరూ అవయవ దానంపై అవగాహన పెంచుకోవాలని, మరణానంతరం మరొకరికి జీవం పోయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అఖిలభారత శరీర, అవయవదాతల సంఘం కోఆర్డినేటర్ శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు అనిరుద్రారెడ్డి, అంజయ్య, కేజియా, నాగేందర్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.