ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలి

27-10-2026 | 09:02pm

- దిల్ సుఖ్ నగర్ లో నిరుద్యోగుల జేఏసీ డిమాండ్ 

ఎల్బీనగర్, అక్టోబర్ 27: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని దిల్ సుఖ్ నగర్ లో నిరుద్యోగుల జేఏసీ(Unemployed JAC) నాయకులు డిమాండ్ చేశారు.  నవంబర్ 7న అశోక్ నగర్ నుంచి ఇందిరా పార్క్ వరకు నిరుద్యోగుల శాంతియుత మహా ర్యాలీకు సంబంధించి వాల్ పోస్టర్ ను మంగళవారం ఆవిష్కరించారు.

నిరుద్యోగ జేఏసీ చైర్మన్, తెలంగాణ బీఈడీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూక్యా కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చి మొదటి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేస్తానని హామీ ఇచ్చిందన్నారు. ఇప్పటివరకు కూడా కేవలం పోలీస్ శాఖలో విడుదల చేసిందని గుర్తు చేశారు. ఇందులోనూ రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయకుండా ఒకరికి అన్నం పెట్టి మరొకరికి సున్నం పెట్టే రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిందని విమర్శించారు.

డీఎస్సీ, గురుకుల నోటిఫికేషన్, మోడల్ స్కూల్ నోటిఫికేషన్ విడుదల చేయాలని, జీపీవో, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, గ్రూప్ నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.  కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాతనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని లేని పక్షంలో నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీని ఓడించి బుద్ధి చెప్తామని హెచ్చరించారు.  నవంబర్ 7న నిర్వహించే నిరుద్యోగ శాంతియుత మహా ర్యాలీని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు,  చిక్కడపల్లి జేఏసీ నాయకులు కిరణ్ రాథోడ్, కయ్య వెంకటేష్, దిల్ సుఖ్ నగర్ జేఏసీ నాయకులు పవన్ యాదవ్, వీరేందర్ , నరేందర్ రెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు