వరి వద్దు
- యాసంగిలో ఆరుతడి పంటలే మేలు
- ఎల్ నినో పరిస్థితుల్లో రైతన్నకు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి
- అన్నదాతలు పెద్ద మనసు చేసుకుని సహకరించాలి
- రిజర్వాయర్లలో 209 టీఎంసీల నీళ్లే అందుబాటులో..
- తాగునీటికే ప్రాధాన్యత.. మంత్రులతో సీఎం సమీక్ష
హైదరాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి): రోజురోజుకూ ఎల్ నినో ఎఫెక్ట్(El Nino Effect) పెరుగుతోందని, ఇది కరోనాను మించిన పెను విపత్తుగా మారిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) చెప్పారు. ఈ పరిస్థి తుల్లో రైతులు పెద్ద మనసు చేసుకుని, ఈ యాసంగిలో వరి పంట వేయకుండా ఆరుతడి పంటలు వేసి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గురువారం సచివాలయంలో సీఎం ఎల్ నినో ప్రభా వంపై మంత్రులతో సమీక్ష నిర్వహించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ, 100 దేశాల్లో ఎల్ నినో ప్రభావం ఉందని, మనకు ఇప్పుడు వేసవి తరహా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయన్నారు. ఎల్ నినోను సమర్థవంతంగా ఎదు ర్కొనేందుకు కార్యాచరణ తీసుకున్నామని వివరించారు. సాగు, తాగునీటి కొరతతో పాటు విద్యుత్ కొరత కూడా ఏర్పడుతోందన్నారు. తెలంగాణలో వరి పండించే రైతులు ఎక్కువగా ఉన్నారని, 56 లక్షల ఎకరాల్లో వరి పంట వేశారని తెలిపారు. 13 లక్షల ఎకరాల్లో వరి కాకుండా ఇతర పంటలు వేశారని సీఎం తెలిపారు. తప్పుడు ప్రచారాన్ని నమ్మి వరి వేస్తే నారుమడి దశలోనే ఎండిపోయే ప్రమా దం ఉందన్నారు.
విద్యుత్ డిమాండ్ పెరిగింది..
మార్చిలో ఉండాల్సిన ఉష్ణోగ్రత అక్టోబర్‌లోనే ఉందని, అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటికే విద్యుత్‌కు డిమాండ్ పెరిగి.. ఉత్పత్తి తగ్గిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యుత్ శాఖ సమర్థవంతంగా పనిచేసి.. రైతులకు, పరిశ్రమలకు విద్యుత్‌ను సరఫరా చేస్తోందని, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సిబ్బంది విజయవంగా పనిచేస్తున్నారని సీఎం అభినందించారు. ‘అక్టోబర్ నెలలో 15 వేల మెగావాట్లు ఉండాల్సిన విద్యుత్ డిమాండ్ 20 వేల మెగావాట్లకు పెరిగింది. అదనంగా 5 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ పెరిగింది. ఈ 13 ఏళ్లలో 14 వేల మెగావాట్ల అదనపు విద్యుత్ డిమాండ్ పెరిగింది. ఈ రెండేళ్లలో ఆరు, ఏడు వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ పెరిగింది.
మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరా జరుగుతోంది. విద్యుత్ శాఖ సమర్థవంతంగా పనిచేసి రైతులకు, ఇతర అవసరాలకు విద్యుత్‌ను సరఫరా చేస్తోంది. మరో 20 రోజుల్లో వానాకాలం పంటలు కోతకు వస్తాయి. చేతికొచ్చిన పంట ఎండిపోకూడదన్న లక్ష్యంతో మార్కెట్లో ఏ ధరకు విద్యుత్ దొరికినా కొనుగోలు చేసి రైతులకు అందిస్తున్నాం. కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు కూడా విద్యుత్ కొరతతో ఉన్నాయి. రైతులు మనోధైర్యం కోల్పోకుండా మా ప్రభుత్వం విద్యుత్‌ను సరఫరా చేస్తోంది. గృహ అవసరాలకు తగినట్లుగా విద్యుత్‌ను అందిస్తున్నాం’ అని సీఎం తెలిపారు. రాష్ట్రంలోని 30 లక్షల పంప్సెట్లు ఆన్ అయ్యాయని తెలిపారు.
అందుబాటులో 209 టీఎంసీలే..
‘రాష్ట్రంలో ఉన్న అన్ని రిజర్వాయర్లలో కలిపి 460 టీఎంసీల నీరు ఉండాల్సిన పరిస్థితుల్లో ఇప్పుడు కేవలం 209 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ నీటిని పంటలకు ఇస్తే కేవలం నారుమళ్లకే సరిపోతాయి. సాగుకు నీటిని తగ్గిస్తూ.. తాగునీటి కష్టాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొందని, కాబట్టి రైతులు ప్రభుత్వానికి సహకరించాలి. కృష్ణా బేసిన్లో 72 శాతం నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయి. గోదావరి బేసిన్లో 40 శాతం నీటి నిల్వలు తక్కువగా ఉ న్నాయి. అన్ని రిజర్వాయర్లు వట్టిపోయే దశలో ఉన్నాయి.
24 వేల గ్రామాలకు మంచినీటి సరఫరా చేయాల్సి ఉంది. తాగునీటికే ఈ రోజు క్లిష్టమైన పరిస్థితి ఉంది. వచ్చే 8 నుంచి 10 నెలల్లో తలెత్తే పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. కేంద్రం నుంచి ఎలాంటి సహకారం తీసుకోవాలనే దానిపై చర్చించాం. 10 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయే పరిస్థితి ఉందని నివేదికలు వచ్చాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ పంటను ఎండిపోనివ్వొద్దని అధికారులను ఆదేశించాం. ప్రస్తుతం రిజర్వాయర్లలో ఉన్న నీటిని చాలా పొదుపుగా వాడాలి. బండ్లు, కార్లు కడుక్కోవడానికి వాడొద్దు’ అని ముఖ్యమంత్రి చెప్పారు.
ఉపాధిహామీ ద్వారా పనులు చేపట్టడానికి కార్యాచరణను రూపొందిస్తున్నామని తెలిపారు. ‘గత ఏడాది ఈ సమయంలో 25 వేల మంది ఉపాధి హామీ పను లు చేస్తే, ప్రస్తుతం రెండున్నర లక్షల మంది పనుల్లో పాల్గొంటున్నారు. వానాకాలంలో నష్టపోయిన పంట తో పాటు వచ్చే సీజన్లో పంట వేయకుండా నష్టపోయిన రైతులను కేంద్రం ఆదుకోవాలి. కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు ఇచ్చే పథకాల ద్వారా రైతులను ఆదుకోవాలని, అందుకు తయారు చేయాలి’ అని సూచించారు.
కళాకారులతో గ్రామాల్లో ప్రచారం..
కరువు తీవ్రత విషయంలో కళాకారులతో గ్రామాల్లో కళాజాతను నిర్వహిస్తామని సీఎం తెలిపారు. రాజకీయ పార్టీలు , ప్రతి పౌరుడు కూడా ప్రభుత్వానికి సహకరించి ప్రభుత్వ సూచనలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని సీఎం సూచించారు. మీడియా సహకారం ప్రభుత్వానికి వందకు వంద శాతం అవసరమని, ప్రభుత్వం నుంచి మీడియా కోసం ఒక నోడల్ ఆఫీసర్‌ను నియమించి టోల్ ఫ్రీ నంబర్ ఇస్తామని తెలిపారు. ‘సీనియర్ జర్నలిస్టులు, నిపుణులు పత్రికల్లో వ్యాసాలు రాయాలి.
సినీ నటుడు విజయ్ దేవరకొండ ఎల్ నినోపై ఒక విజ్ఞప్తి చేశారు. మిగిలిన సినీ నటులు, క్రీడాకారులు, కళాకారులు, మేధావుల సహకారం తీసుకుని వారితో ప్రజలకు ఒక విజ్ఞప్తి చేయించి అప్రమత్తం చేస్తాం’ అని తెలిపారు. ప్రతిపక్షాలు, కార్మిక సంఘాలు.. అందరితో మాట్లాడి భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తామన్నారు. ‘వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల ఏర్పడే సమస్యలపై వైద్య ఆరోగ్య శాఖను అప్రమత్తం చేశాం.’ అని సీఎం తెలిపారు.
దసరా తర్వాత అఖిలపక్ష సమావేశం..
డిప్యూటీ సీఎం భట్టి నాయకత్వంలో దసరా తర్వాత అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని వివరిస్తామని, నవంబర్ మొదటివారంలో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్ర హోంశాఖ మంత్రిని, ఇతర మంత్రులను కలుస్తామని సీఎం తెలిపారు.
మరణశాసనం రాసింది ఎవరు..?
‘కాంగ్రెస్ వల్లనే కరవు వచ్చిందని బీఆర్ఎస్ అనడం వాళ్ల పైశాచిక ఆనందానికి ఇది నిదర్శనం. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్తాన్ రాష్ట్రాలతో పాటు బ్రిటన్, జపాన్ లాంటి దేశాల్లో కాంగ్రెస్ పార్టీ ఉందా? అక్కడ ఎలా ఏ సమస్య ఉంది? 100 దేశాల్లో ఎల్ నినో ఈ సమస్య ఉంది.. మిడిమిడి జ్ఞా నంతో మాట్లాడుతున్నారు’ అని సీఎం ఆగ్ర హం వ్యక్తంచేశారు.‘అబద్ధాలతోనే అధికారంలోకి రావాలని, ప్రభుత్వంపై బురదజల్లాలని చూస్తున్నారు. ఎవరు పక్క రాష్ట్రాలకు వెళ్లి శుద్రపూజలు చేశారో, చేతబడి చేశారో తెలంగాణ ప్రజలకు తెలుసు.. ప్రజలు అమాయకులు కాదు.
2015లో కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 515 టీఎంసీలు చాలని ఎవరు సంతకం పెట్టారు? సంతకం పెట్టినవాడు మనిషేనా? కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులను శాశ్వతంగా ధారాదత్తం చేసింది మీరు కాదా? చంద్రబాబు ముందు మోకరిల్లి సంతకం పెట్టింది మీరు. రోజమ్మ రాగి సంకటి పెడితే రాయలసీమను రతనాల సీమ చేస్తానని చెప్పింది మీరు. పాలమూరు కు నీళ్లు ఇవ్వాలని ఒక్కరోజైనా మాట్లాడారా? పాలమూరు -రంగారెడ్డి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, ఎస్ఎల్బీసీ, డిండి, సీతారామసాగర్ను ఎందుకు పూర్తి చేయలేదు. సాగునీటి ప్రాజెక్టులపైన ఒక లక్షా 80 వేల కోట్లు ఖర్చు చేశారు. 40 వేల కోట్లు బకాయిలు పెట్టిపోయారు. పాలమూరు- రంగారెడ్డి పంపులు ఆన్ చేస్తే దానిపైన కూడా కడుపుమంట, కుళ్లు ఉంది ’ అని బీఆర్ఎస్పై సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్ అయ్యారు.
కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు కొండపోచమ్మ నీళ్లు?
కొండపోచమ్మ నుంచి పంచపాండవుల చెరువుకు ఒక కాలువ తవ్వారు. పంచపాండవుల చెరువు నుంచి నేరుగా కేసీఆర్ ఫామ్ హౌస్‌లోని 400 ఎకరాలకు నీళ్లు అందిస్తున్నారు. కేసీఆర్‌కు ఎందుకు ఈ ప్రత్యేకమైన సౌకర్యం ఉంది? దీనిపై నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటుచేద్దామా? కేసీఆర్‌కు నీళ్లు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? పంపుల కనెక్ష న్ను తొలగించడానికి కేసీఆర్ ముందుకు వస్తారా?. పంచపాండవుల చెరువు నుంచి నీళ్లు ఎవరి పొలాలకు వెళ్తున్నాయో చూసి, తెలంగాణ ఎవరి పాలైందో చెప్పాలి.
కృష్ణా, గోదావరి జలాలపై చర్చకు సిద్ధమా..?
‘కృష్ణా నీటిని శాశ్వతంగా చంద్రబాబుకు, జగన్‌కు తాకట్టు పెట్టారు. ఉమ్మ డి రాష్ట్రంలో కూడా అంత నష్టం జరగలేదు. అసెంబ్లీలో చర్చ పెడితే రావడం లేదు. ఇప్పుడు కృష్ణా, గోదావరి జలాలపై చర్చకు సిద్ధమా? మేడిగడ్డను కూలగొట్టి మళ్లీ కట్టాలని నిపుణులు చెబుతున్నారు. గోదావరిపై ప్రాజెక్టులు కట్టలేదు. ఏదో రకంగా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలన్నదే ఉద్దేశం. వాళ్ల అవినీతి, దొంగతనాలపై చర్చ జరగొద్దు అన్నదే వాళ్ల ప్రయత్నం. అబద్ధాలు చెబితే ప్రజలు నమ్మరు.ఎప్పుడైనా అసెంబ్లీలో గోదావరి, కృష్ణా జలాలపై మేం చర్చకు సిద్ధం.నీటి హక్కులను ఏ విధంగా హరించారో చర్చకు మేం సిద్ధం. అబద్ధాలు చెప్పడం ఆపనంతకాలం మేం నిజాలు చెబుతూనే ఉంటాం. మేం నిజాలు చెబితే మీరు తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు ’ అని సీఎం అన్నారు.
కేంద్రం సహాయం కోరుతాం..
ప్రస్తుతం రాష్ట్రంలో అవసరానికి తగినంత విద్యుత్ ఉత్పత్తి జరగడం లేదన్న సీఎం.. కేంద్రాన్ని విద్యుత్ పై సహాయం చేయమని అడగాలనుకుంటున్నట్లు తెలిపారు. కేంద్రం నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, ఇందుకు కేంద్రం సహకరించాలని కోరారు. కొవిడ్ సమయంలో తాము ఎలాంటి రాజకీయాలు చేయలేదని, ఇప్పుడు మాత్రం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులపై కొందరు రాజకీయాలు చేస్తున్నారని అసహనం వ్యక్తంచేశారు.
ఈ ప్రకృతి విపత్తును మనందరం కలిసి ఎదుర్కోవాలని, పార్టీలు, పౌరులంతా ప్రభుత్వానికి సహకరించాల్సిన సమయమని సీఎం చెప్పారు. కొవిడ్ సమయంలో వ్యాక్సిన్ వచ్చేవరకూ ఎలా సహకరించుకున్నామో.. ఇప్పుడు కూడా అంతే సహకారం ఉండాలన్నారు. ఎల్ నినోపై ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇచ్చేలా ఒక వార్ రూమ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకు నోడల్ ఆఫీసర్‌గా కే రామకృష్ణారావును నియమించామని, ఆయన ఇచ్చిన సమాచారాన్ని తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. ఎల్ నినోపై అఖిలపక్షంతో చర్చలు జరుపుతున్నామని, నివేదిక ద్వారా చర్యలు తీసుకుంటామన్నారు.
- విదేశీ బొగ్గు..
- వారి ఆలోచనే ఏ విచారణకైనా సిద్ధమే
- దామరచర్లలో బొగ్గు లేకున్నా.. యాదాద్రి పవర్ ప్లాంట్‌ను ఎందుకు నిర్మించారు?
- ఆ ప్లాంట్ వల్ల వచ్చే 25 ఏళ్లలో లక్ష కోట్ల భారం పడుతుంది: సీఎం రేవంత్
హైదరాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి): విదేశీ బొగ్గు కొనుగోళ్లపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాసిన లేఖపై సీఎం రేవంత్ రెడ్డి గురువారం స్పందించారు. విదేశీ బొగ్గుపై ఏ విచారణకైనా ఆదేశించేందుకు తను సిద్ధంగా ఉన్నట్లు స్పష్టంచేశారు. ఏ విచారణ కావాలో చెప్పాల్సింది కేటీఆరే అన్నారు. ఈ విషయంలో ప్రజా కోర్టు ముందు బహిరంగ విచారణకైనా సిద్ధమని సీఎం స్పష్టం చేశారు. ‘50 శాతం ఇంపోర్టెడ్ బొగ్గు, సింగరేణిలో జీ9 బొగ్గుతో యాదాద్రిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తామని కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారు. విదేశీ బొగ్గు గురించి మేం మాట్లాడలేదు. కేసీఆర్ హయాంలో ఎంఎస్పీసీతో 2016లో ఒప్పందం చేసుకున్నారు.
యాదాద్రికి కావాల్సిన 14 మిలియన్ టన్నుల బొగ్గులో 7 మిలియన్ టన్నుల దిగుమతి బొగ్గు కోసం డిసెంబర్ 9, 2016న ఒప్పందం చేసుకున్నారు. గ్రేడ్ 9 బొగ్గును దిగుమతి చేసుకుంటామని ఒప్పందంలో పేర్కొన్నారు’ అని, 4వేల మెగావాట్ల పవర్ ప్రాజెక్టుకు సంవత్సరానికి 14 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం పడుతుందని చెప్పారు. అయితే 7వేల మెట్రిక్ టన్నుల బొగ్గు దిగుమతి చేసేందుకు 2016లో బీఆర్ఎస్ హాయంలోనే అగ్రిమెంట్ చేసుకున్నారని చెప్పారు. విదేశాల నుండి గ్రేడ్ 9 బొగ్గును దిగుమతి చేస్తున్నట్టు ఈ అగ్రిమెంట్ సారాంశం అని తెలిపారు.
‘ఎక్కడైనా.. బొగ్గు ఎక్కడ ఉంటే అక్కడే ప్రాజెక్టు కడుతారని కానీ అక్కడ కట్టకుండా విద్యుత్ సంక్షోభం రాబోతుందని 1,040 మెగావాట్ల భద్రాద్రి పవర్ ప్లాంట్, 4,000 మెగావాట్ల యాదాద్రి పవర్ ప్లాంట్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలని కేసీఆర్ హడావుడి చేశాడు. బొగ్గు, నీళ్లు అందుబాటులో ఉండే ప్రాంతంలోనే పవర్ ప్రాజెక్టులు కడతారు. సింగరేణి ప్రాంతంలో కాకుండా దామరచర్లలో యాదాద్రిని నిర్మించారు. నామినేషన్ బేసిక్‌పై ప్లాంట్లు ఇస్తున్నట్లు కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు. ఇందులో అవినీతి ఉందని మేం వ్యతిరేకించాం. ఛత్తీస్‌ఘడ్ నుంచి 1,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుపై విద్యుత్ రంగ నిపుణుడు రఘుతో పాటు అందరం వ్యతిరేకించాం. యాదాద్రి సూపర్ క్రిటికల్ పవర్ ప్రాజెక్టు కట్టడానికి రూ.17,950 కోట్లతో ఒప్పందం చేసుకున్నారు.
మూడేళ్లలో కడతామని బీహెచ్ఈఎల్తో ఒప్పందం చేసుకున్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ కోసం రూ.37,781 కోట్ల వ్యయం పెరిగింది. 110 శాతం అంచనాలు పెరిగాయి. ఒక యూనిట్‌కు రూ. 9.50 కోట్ల ఖర్చవుతోంది. అదే సమయంలో భద్రాద్రిలో ఎన్టీపీసీ కేవలం రూ.7.50 కోట్లతో యూనిట్‌ను పూర్తి చేసింది. ప్రతి మెగావాట్‌కు రూ. 200 అంచనా పెరిగింది. దీనికి బాధ్యులు ఎవరు.. ? రూ. 8 వేల కోట్లు అక్రమంగా ఎవరు తిన్నారు..?’ అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.
‘గ్రేడ్ 9 వద్దు, ఏదైనా నడుస్తుందని ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. గ్రేడ్ 9 నుంచి గ్రేడ్ 18 వరకు వివిధ రకాల బొగ్గు ఉంటుంది. గ్రేడ్ 9 కాకుండా మిగిలిన రకం బొగ్గును విద్యుత్ ఉత్పత్తికి వాడితే బూడిద ఎక్కువగా వస్తుంది. 7 మిలియన్ టన్నుల దిగుమతి బొగ్గు తెస్తున్నామని 2016లో రైల్వేకు ఒక లేఖ రాశారు. ఈ ఒప్పందాల వెనుక ఉన్న ప్రతిభావంతుడు ఎవరు..? నమస్తే తెలంగాణలో రూ. 100 కోట్లు పెట్టి షేర్లు కొన్నది ఎవరు..? ఆ ముసుగు వీరుడు ఎవరు...?’ అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
సింగరేణిని నిండా ముంచారు..
యాదాద్రి ప్రాజెక్టును మణుగూరు ప్రాంతంలో కట్టి ఉంటే ఖర్చు తగ్గేదని, అయితే సింగరేణిని నిండా ముంచి ఈ ప్రాజెక్టును కట్టారని సీఎం ఆరోపించారు. యూనిట్ రూ.4.62కు మణుగూరులో విద్యుత్ ఉత్పత్తి అవుతోందని, కొత్తగూడెంలో యూనిట్ రూ.3.94కు విద్యుత్ ఉత్పత్తి అవుతోందని తెలిపారు. సింగరేణి1,2 లో యూనిట్ కు రూ.4.05కు విద్యుత్ ఉత్పత్తి అవుతోందని, అదే యాదాద్రిలో యూనిట్ రూ.6.60కు ఉత్పత్తి అవుతోందని, అదనంగా రూ.2.20 ఖర్చవుతుందని తెలిపారు. ‘యాదాద్రి వల్ల 50 వేల కోట్ల అదనపు భారం పడుతుంది. వచ్చే 25 ఏళ్లలో లక్ష కోట్ల నష్టం జరుగుతుంది.
‘ఏ బొగ్గైనా వాడొచ్చునని మద్యం కలిపే ‘మిక్సాలిజిస్టు’ చెపుతున్నాడు. ఇలాంటి మిక్సాలజిస్టును మొదటిసారి చూస్తున్నాం. కృష్ణపట్నం పోర్టు నుంచి విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోవడానికి ఒక ముసుగు వీరుడిని తయారు చేశారు. సింగరేణిలో జీ9 బొగ్గు లభ్యత 2 మిలియన్ టన్నులు మాత్రమే. 141 టెండర్లు జరిగితే ఒక్కదాంట్లో కూడా సింగరేణి పాల్గొనకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది.
దిగుమతి బొగ్గు కోసం టెండర్లలో పాల్గొనలేదు. 100 శాతం దిగుమతి చేసుకోవాలన్న ఉద్దేశంతో ఎన్జీటీలో కేసు వేయించి స్టే ఇప్పించారు. మొత్తం 14 మిలియన్ టన్నుల బొగ్గును విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితిని తెచ్చారు. 2024లో ప్రజాభిప్రాయ సేకరణ చేపించి, సింగరేణి బొగ్గును మాత్రమే వాడుతామని తీర్మానం చేయించి ఎన్జీటీలో స్టే ఎత్తివేయించాం’ అని చెప్పారు.
యాదాద్రిలో ఐదో యూనిట్ ఇంకా పూర్తి కాలేదని, నైనీ కోల్ నుంచి రోజుకు రెండు, మూడు ర్యాక్‌లు తీసుకొచ్చి యాదాద్రిలో విద్యుత్ ఉత్పత్తిని మొదలుపెట్టామని తెలిపారు. ‘జీ౯ బొగ్గు కోసం మహానది కోల్ ఫీల్డ్స్, కోల్ ఇండియా సహకారం కావాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో ఈ రోజు నేను మాట్లాడాను. కేంద్ర సబ్ కమిటీతో సత్వరం ఈ విషయం మాట్లాడుతానని కిషన్‌రెడ్డి చెప్పారు. దేశీయ బొగ్గునే యాదాద్రిలో వాడటానికి మేం ప్రయత్నాలు చేస్తున్నాం’ అని సీఎం వివరించారు.
అవినీతిపై చర్చుకు ఎప్పుడైనా సిద్దమే..
డ్రగ్స్, ఫామ్‌హౌస్, స్టార్ హోటళ్లు, 22 ఏ వంటి అంశాల్లో కేటీఆర్ బుకాయించడానికి ప్రయత్నం చేశారని సీఎం తెలిపారు. మెడికవర్ ఆసుపత్రి విషయంలో బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణల గురించి మీడియా ప్రశ్నించగా, అన్నం తినేవాడు ఆరోపణలు చేస్తే ఆధారాలు చూపించాలని సీఎం ఘాటుగా స్పదించారు. అదే ఆసుపత్రిని కేసీఆర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా ప్రారంభించారని, ప్రారంభించినవన్నీ తనవే అయితే ప్రపంచంలోనే శ్రీమంతుడిని తనే అవుతానని సీఎం పేర్కొన్నారు. అవినీతిపై చర్చకు ఎప్పుడైనా తాను సిద్ధమేనని అన్నారు.