పాత ప్లాట్లకు ‘కొత్త’ ధరల ఉచ్చు!
సామాన్యుడి నడ్డి విరుస్తున్న పన్ను పోటు
అప్పుడెప్పుడో కొన్న స్థలానికి నేటి మార్కెట్ విలువతో వడ్డింపు
రూ.800 పన్ను కాస్తా ఏకంగా రూ.1.20 లక్షలకు చేరిన వైనం
వేకెంట్ ల్యాండ్ టాక్స్ బకాయిలతో బెంబేలెత్తుతున్న స్థల యజమానులు
ఆదిభట్ల, నవంబర్ 2౩ (విజయక్రాంతి): భవిష్యత్తు అవసరాల కోసమో, పిల్లల పెళ్లిళ్ల కోసమో అప్పట్లో రూపాయి రూపాయి కూడబెట్టి కొనుక్కున్న చిన్నపాటి ఖాళీ స్థలాలు(Vacant spaces) ఇప్పుడు సామాన్యుల పాలిట గుదిబండగా మారాయి. పట్టణ ప్రాంతాల్లో విధిస్తున్న ఖాళీ స్థలాల పన్ను(Tax on vacant land) (వేకెంట్ ల్యాండ్ టాక్స్) లెక్కింపు విధానం మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తోంది.
దశాబ్దాల క్రితం తక్కువ ధరకు కొన్న స్థలాలకు సైతం.. ప్రస్తుత మార్కెట్ విలువ(Market value) ఆధారంగా పాత బకాయిలు వేస్తుండటంతో యజమానులు లబోదిబోమంటున్నారు. ముఖ్యంగా అవసరానికి స్థలం అమ్ముకోవాలన్నా, రిజిస్ట్రేషన్(Registration) చేయించుకోవాలన్నా లక్షల్లో పన్ను కట్టాల్సి రావడం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
ఏడాదికి రూ.6 వేలకు జంప్..
పన్ను బాదుడు ఏ స్థాయిలో ఉందో ఈ ఒక్క లెక్క చూస్తే అర్థమవుతుంది. ఉదాహరణకు.. ఒక సామాన్యుడు 2006లో 200 గజాల ఖాళీ స్థలాన్ని గజం రూ.800 చొప్పున రూ.1.60 లక్షలకు కొనుగోలు చేశాడనుకుందాం. అప్పటి విలువ ప్రకారం 0.5 శాతం పన్ను వేస్తే ఏడాదికి కట్టాల్సింది కేవలం రూ.800 మాత్రమే. కానీ, 2026 నాటి మార్కెట్ విలువ ప్రకారం అదే స్థలం గజం రూ.6 వేలకు (మొత్తం రూ.12 లక్షలకు) చేరింది. దీంతో అధికారులు ఇప్పుడు ఏడాదికి 0.5 శాతం చొప్పున ఏకంగా రూ.6 వేల పన్ను విధిస్తున్నారు.
పాత బకాయిల పేరుతో రూ.1.20 లక్షల భారం??
ఇక్కడితో కథ ముగియలేదు. అసలు చిక్కంతా పాత బకాయిల దగ్గరే వస్తోంది. 2006 నుంచి 2026 వరకు గడిచిన 20 ఏళ్లకు గాను, పాత ధర ప్రకారం కాకుండా.. ప్రస్తుత విలువ ఆధారంగా ఏడాదికి రూ.6 వేల చొప్పున లెక్క కడుతున్నారు. అంటే 20 ఏళ్లకు కలిపి ఒకేసారి రూ.1.20 లక్షలు కట్టాలంటూ నోటీసులు ఇస్తున్నారు. గతంలో స్థలం విలువ తక్కువగా ఉన్న కాలానికి కూడా నేటి ధరలతో పన్ను వసూలు చేయడం ఎంతవరకు న్యాయమని యజమానులు ప్రశ్నిస్తున్నారు. కొనుగోలు చేసిన నాటి విలువను పరిగణనలోకి తీసుకుని పన్ను భారం తగ్గించాలని వేడుకుంటున్నారు.
తక్షణమే విధానాన్ని మార్చాలి..
‘ఏళ్ల క్రితం కష్టపడి కొనుక్కున్న స్థలాలకు నేటి మార్కెట్ విలువతో పన్ను బకాయిలు వేయడం సామాన్యులను నిలువునా ముంచడమే. 2006లో గజం రూ.800 ఉన్న చోట, 2026 నాటికి రూ.6 వేలకు చేరింది. ఆ పెరిగిన ధరను 20 ఏళ్ల వెనక్కి వర్తింపజేసి రూ.1.20 లక్షల పన్ను కట్టమనడం అన్యాయం. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ విధానాన్ని పునఃసమీక్షించాలి. పాత స్థలాల యజమానులకు పన్ను బకాయిల విషయంలో వెసులుబాటు కల్పించి ఆదుకోవాలి.
మల్లెల వంశీ,
బీఆర్ఎస్వీ నాయకుడు