వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా(Sangareddy district) సిర్గాపూర్ మండల పరిధిలోని కడ్పల్ గ్రామం(Kadpal Village)లో రైతులకు మద్దతు ధర అందించడమే లక్ష్యంగా ఐకేపీ (ఇందిరా క్రాంతి పథం) ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని(Paddy Procurement Center) శుక్రవారం ఐకేపీ ఏపీఎం సరిత, సర్పంచ్ విమల విట్టల్ రెడ్డి, సీసీ నాగమణిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజాప్రతినిధులు, ఐకేపీ అధికారులు ఏపీఎం,సీసీ, మహిళా సంఘాల సభ్యులు పాల్గొని కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏపీఎం సరిత, ఐకేపీ సీసీ నాగమణి మాట్లాడుతూ రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్ల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని నిర్వాహకులకు తెలిపారు. ధాన్యంలో తేమ శాతం ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలని, రైతులు కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.