టీచర్ల హక్కుల కోసం.. పీఆర్టీయూ నేతల అడుగులు
నారాయణఖేడ్, అక్టోబర్ 15 (విజయక్రాంతి): నల్గొండలో నిర్వహించనున్న పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర మహాసభలకు నారాయణఖేడ్ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన ఉపాధ్యాయ సంఘం నాయకులు గురువారం ఉత్సాహంగా బయలుదేరారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, పెండింగ్ డిమాండ్ల సాధన, విద్యారంగ అభివృద్ధి వంటి కీలక అంశాలపై చర్చించేందుకు నిర్వహిస్తున్న ఈ సమావేశాలకు నాయకులు తరలివెళ్లారు.
ఉపాధ్యాయుల సమస్యలపై ప్రధాన చర్చ
రాష్ట్ర మహాసభల్లో ఉపాధ్యాయుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, పదోన్నతులు, బదిలీలు, పెండింగ్ ఆర్థిక ప్రయోజనాలపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని సంఘం నాయకులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలంటే ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని అభిప్రాయపడ్డారు. ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణ, వారి న్యాయమైన డిమాండ్ల సాధనకు పీఆర్టీయూ టీఎస్ (PRTU TS) నిరంతరం కృషి చేస్తుందని నాయకులు స్పష్టం చేశారు. రాష్ట్ర మహాసభల్లో తీసుకునే నిర్ణయాలు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ మల్లయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎక్కం పాండురంగారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు రమేష్, శ్రీనివాస్, నాగనాథ్, నాగల్గిద్ద మండల అధ్యక్షుడు రమేష్, నారాయణఖేడ్ మండల ప్రధాన కార్యదర్శి రాజు, మండల అసోసియేట్లు విజయేందర్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, నర్సింలు, చంద్రయ్య స్వామి తదితరులు పాల్గొన్నారు.