ఖాళీలు 2 వేలకు పైగా.. భర్తీ 500 లోపే!

15-10-2026 | 05:30am
  1. అధ్యాపకుల కొరత తీరేదెలా?
  2. కుంటుపడుతున్న బోధన, పరిశోధనలకు విఘాతం
  3. పలు వర్సిటీల్లో హెచ్‌ఓడీ పోస్టులూ ఖాళీ  
  4.    13 ఏళ్ల తర్వాత నియామకాలకు చర్యలు
  5. విద్యాశాఖ కొత్త మార్గదర్శకాలు విడుదల 

హైదరాబాద్, అక్టోబర్ 14 (విజయక్రాంతి): యూనివర్సిటీ(University)ల్లో అధ్యాపక పోస్టుల ఖాళీలు(Vacancies for teaching posts) 2 వేలకు పైనే.. భర్తీ మాత్రం 500 లోపే! 13 ఏళ్ల తరువాత నియామకాలకు మార్గం సుగమమైనా.. ఖాళీలన్నింటినీ భర్తీ చేసే దిశగా చర్యలు లేకపోవడం గమనార్హం. అరకొర పోస్టుల భర్తీతోనే సరిపెట్టే పరిస్థితి కనిపిస్తోంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల(Assistant Professor Posts) భర్తీకి  నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వం తాజాగా కొత్త మార్గదర్శ కాలను విడుదల చేసింది. దీంతో నియామక ప్రక్రియ(Recruitment process) ముందుకు కదిలే అవకాశం ఏర్పడింది.

అయితే రాష్ట్రంలోని వర్సిటీల్లో దాదాపు 75 శాతం పోస్టులు ఖాళీ ఉండగా.. పరిమిత నియామకాలతో అధ్యాపకుల కొరత తీరేదెలా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సరిపడా అధ్యాపకులు లేక ఇప్పటికే బోధన, పరిశోధనలపై ప్రభావం పడుతుండగా.. అరకొర నియామకాలతో విశ్వవిద్యాలయాల పరిస్థితి ఏ మేర కు మెరుగుపడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం యూనివర్సిటీల్లో ఖాళీ పోస్టులు భర్తీకి నోచుకోలేదు. 

కాంట్రాక్ట్, పార్ట్‌టైమ్, గెస్ట్ ఫ్యాకల్టీలతోనే నెట్టుకొస్తున్నారు. ప్రతి ప్రతి వర్సిటీలో 90 శాతం వీరే ఉన్నారు. దీంతో బోధన నాణ్యత, పరిశోధనలతో పాటు అనేక అంశాల్లో తెలంగాణ వర్సిటీలు అట్టడుగు స్థాయికి వెళ్తున్నాయి. నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్‌ఐఆర్‌ఎఫ్), న్యాక్ అక్రిడిటేషన్‌లోనూ వెనుకబడుతున్నాయి. ప్రపంచ స్థాయి వర్సిటీల జాబితాలో మన వర్సిటీలు మచ్చు కైనా కనిపించడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీల్లో 2,816 పోస్టులకు గానూ 2,059 ఖాళీలున్నాయి.

ప్రస్తుతం 755 మంది అధ్యాపకులు మాత్రమే పని చేస్తున్నారు. అసిస్టెంట్, అసోసియేట్, ప్రొఫెసర్ పోస్టులు 70 నుంచి 80 శాతం ఖాళీ ఉన్నాయి. వేల పోస్టులు ఖాళీ ఉన్నప్పటికీ 488 నుంచి 500 పోస్టులు మాత్రమే భర్తీ చేసే అవకాశం ఉంది. కొన్ని వర్సిటీల్లో హెచ్‌ఓడీ పోస్టులు సైతం ఖాళీ. దీనికి తోడూ ఇటీవల పలు యూనివర్సిటీలకు ఇంజినీరింగ్, లా కాలేజీలు మంజూరు కావడంతో అక్కడ కూడా అధ్యాపకులు కావాల్సి ఉంది.  

గత ప్రభుత్వ హయాంలో ముందుకు సాగని ప్రక్రియ

గత ప్రభుత్వ హయాంలో 1,060 పోస్టులను భర్తీ చేయాలన భావించినా, ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. కొత్తగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం యూనివర్సిటీల్లోని ఖాళీలపై దృష్టి సారించింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గతేడాది ఏప్రిల్‌లో నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. దీంతో వర్సిటీల్లో పనిచేస్తున్న దాదాపు 1,200 మంది కాంట్రాక్ట్, పార్ట్‌టైం ప్రొఫెసర్లు తమను రెగ్యులరైజ్ చేశాకే భర్తీ ప్రక్రియ చేపట్టాలని సమ్మెకు దిగారు. దీంతో ప్రభుత్వం 450 పోస్టుల భర్తీకి మాత్రమే అనుమతినిచ్చింది.

అయితే వీరి ఉద్యోగాలకు భరోసానిస్తూ వీరి పోస్టులను పక్కనబెట్టి మిగిలిన పోస్టులను భర్తీ చేయాలని విద్యాశాఖ అప్పట్లో చర్యలు చేపట్టింది. కానీ అది ముందుకు సాగలేదు. తాజాగా జీవో నెం.21లోని లోపాలను సవరిస్తూ యూజీసీ నిబంధనల మేరకు జీవో నెం.31తో నూతన మార్గదర్శకాలను విద్యాశాఖ విడుదల చేసింది. మరోవైపు తమను రెగ్యులరైజ్ చేయాలని కాంట్రాక్ట్ ప్రొఫెసర్లు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. 

మరిన్ని వార్తలు