దాడి చేసి.. కులం పేరుతో దూషించిన వారిని అరెస్టు చేయాలి

02-11-2026 | 07:38pm
  1. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో సమగ్ర విచారణ జరపాలి
  2. ఎమ్మార్పీఎస్ నాయకుల డిమాండ్

గజ్వేల్, నవంబర్ 2 : దళితుడిపై దాడి చేసి కులం పేరుతో దూషించిన నిందితులను తక్షణమే అరెస్టు చేసి బాధితుడు దొడ్డి శ్రీనివాస్ మాదిగకు న్యాయం చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్(MRPS leaders' demand) చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడ గ్రామంలో అక్టోబర్ 20న అదే గ్రామానికి చెందిన రఘుబాబు, ఆయన కుమారుడు రాజేష్ కలిసి దొడ్డి శ్రీనివాస్ మాదిగపై దాడి చేసి కులం పేరుతో దూషించినట్లు పేర్కొన్నారు.

ఈ ఘటనపై అక్టోబర్ 31న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎమ్మార్పీఎస్ నాయకులు బాధితుడిని పరామర్శించి సంఘటన వివరాలు తెలుసుకున్నారు. కేవలం కేసు నమోదు చేసి చేతులు దులుపుకోకుండా సమగ్ర విచారణ చేపట్టి నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసు ఉన్నతాధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించి బాధితుడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, దళితులపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. బాధితుడికి న్యాయం జరిగే వరకు ఎమ్మార్పీఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్  రాష్ట్ర నాయకుడు మైస రాములు మాదిగ, మాజీ జిల్లా అధ్యక్షుడు ముండ్రాతి కృష్ణ మాదిగ, గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జి బుడిగే మహేశ్ మాదిగ, కుకునూరుపల్లి మండల ఇంచార్జి చిన్నరాజిగారి కిషన్ మాదిగ, దళిత నాయకుడు పొట్ట యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు