ఎల్‌నినో ప్రభావాలను తట్టుకునేలా ఉద్యాన పంటల సాగు

30-10-2026 | 05:52pm
  1. ఉద్యాన యూనివర్సిటీలో రైతులకు శాస్త్రవేత్తల సూచనలు.. 
  2. 100 మందికి మామిడి మొక్కలు, ఉద్యాన పంచాంగాల పంపిణీ

గజ్వేల్ , అక్టోబర్ 30: శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంలో(Sri Konda Laxman Telangana State Horticultural University) శుక్రవారం పీఎం కిసాన్ ఉత్సవ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ములుగు, నర్సంపల్లి, పెద్ద మసీద్‌నగర్, క్షీరసాగర్ గ్రామాలకు చెందిన 100 మంది రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుజరాత్ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతులను ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు.

విశ్వవిద్యాలయ విస్తరణ సంచాలకుల కార్యాలయం, పీజీఐహెచ్‌ఎస్ సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కూరగాయలు, పూలు, పండ్ల శాస్త్రవేత్తలు ఉద్యాన పంటల సాగుపై రైతులకు శాస్త్రీయ సూచనలు అందించారు. ముఖ్యంగా రానున్న ఎల్‌నినో ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని నీటి పొదుపు, బిందు సేద్యం, సమతుల్య పోషక యాజమాన్యం, వాతావరణానికి అనుకూలమైన పంట రకాల ఎంపిక, మెరుగైన సాగు పద్ధతులపై అవగాహన కల్పించారు.

అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించుకుంటూ పంట దిగుబడులు సాధించాలని సూచించారు. అనంతరం రైతులకు మామిడి మొక్కలు, ఉద్యాన పంచాంగాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆఫీసర్ ఇన్‌చార్జి డాక్టర్ విజయ, ప్రొఫెసర్ డాక్టర్ సుచిత్ర, అసిస్టెంట్ ప్రొఫెసర్లు చంద్రశేఖర్, లావణ్య, సింధూజ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు