నాడు కృతజ్ఞతలు.. నేడు విమర్శలా?
బెజ్జంకి (విజయక్రాంతి): కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆత్మకథపై మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేసిన వ్యాఖ్యలను సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు డాక్టర్ పోతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు (State Formation)లో సోనియా గాంధీ కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. 2014లో తొలి శాసనసభ సమావేశాల సందర్భంగా అప్పటి సీఎం కేసీఆర్ సైతం ఆమె చొరవను గుర్తించి కృతజ్ఞతలు తెలిపారని పేర్కొన్నారు.
నాడు సోనియా గాంధీ పాత్రను గుర్తించిన నాయకులు.. నేడు ఆమెపై అవమానకర వ్యాఖ్యలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రసమయి రాజకీయ వైఖరిపై కూడా స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజకీయ విమర్శలకు హద్దులు ఉండాలని, వ్యక్తిగత దూషణలు తగవని హితవు పలికారు. సోనియా గాంధీపై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.