పోయిరా బతుకమ్మ.. మళ్లీ వచ్చే ఏడాది

18-10-2026 | 07:22pm

- సల్లంగ చూడు తల్లి బతుకమ్మ!

- పూల పండుగకు ఘనంగా వీడ్కోలు

- విద్యుత్ దీపాల వెలుగుల్లో ఆడపడుచుల సందడి

బెజ్జంకి, అక్టోబర్ 18: బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ బతుకమ్మ పాటలతో బెజ్జంకి మండలవ్యాప్తంగా పల్లెలు మారుమోగాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు(Telangana culture and traditions) ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలను(Saddula Bathukamma celebrations) మహిళలు ఆదివారం భక్తిశ్రద్ధలతో(devotees), ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో పండుగ సందడి నెలకొంది.

రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలు ఆటపాటలతో సందడి చేశారు. విద్యుత్ దీపాల వెలుగులు, పండుగ అలంకరణల నడుమ బతుకమ్మల సోయగాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తొమ్మిది రోజుల పాటు సాగిన పూల పండుగకు సద్దుల బతుకమ్మతో మహిళలు ఘనంగా వీడ్కోలు పలికారు.

“పోయిరా బతుకమ్మ.. మళ్లీ వచ్చే ఏడాది మమ్మల్ని సల్లంగా చూడు తల్లి” అంటూ బతుకమ్మలను సమీపంలోని చెరువులు, శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయ కొలనుల్లో   నిమజ్జనం చేశారు. గౌరీదేవిని పూజించి, కుటుంబాలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. అనంతరం సద్దులను నైవేద్యంగా సమర్పించి, వాయినాలను ఇచ్చిపుచ్చుకున్నారు.

వేడుకల్లో మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. సర్పంచ్ బొల్లం శ్రీధర్ పెద్దన్న ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేపట్టారు. బతుకమ్మ పాటలు, పూల పరిమళాలు, మహిళల కోలాటాలతో బెజ్జంకి మండలంలో సద్దుల బతుకమ్మ సంబరాలు వైభవంగా ముగిశాయి.

మరిన్ని వార్తలు