తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక బతుకమ్మ

18-10-2026 | 08:01pm

మాజీ మంత్రి, ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి!!

శివంపేట అక్టోబర్ 18 ( విజయక్రాంతి ) : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు(Telangana culture and traditions) ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి(Vakiti Sunitha Lakshma Reddy) ఆకాంక్షించారు. ఆదివారం శివంపేట(Shivampet) మండలంలోని తన స్వగ్రామమైన గోమారంలో సద్దుల బతుకమ్మ(Saddula Bathukamma) సందర్భంగా ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మను అందంగా అలంకరించారు.

తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మ పండుగ శోభను చాటగా, కుటుంబ సభ్యులతో కలిసి సంప్రదాయబద్ధంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ వివిధ రకాల పూలతో బతుకమ్మను పేర్చి జరుపుకునే ఈ పండుగ తెలంగాణకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిందని తెలిపారు.

తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలను కాపాడుకుంటూ బతుకమ్మ వేడుకలను భక్తిశ్రద్ధలతో, ఐకమత్యంతో జరుపుకోవాలని సూచించారు. బతుకమ్మ పండుగ మహిళల మధ్య ఆత్మీయతను పెంపొందించడంతో పాటు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కలిసి ఆనందాన్ని పంచుకునే గొప్ప సందర్భమని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే ఇలాంటి పండుగలను భావితరాలకు పరిచయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.

ప్రకృతిలో లభించే పూలతో బతుకమ్మను అలంకరించి పూజించడం మన సంప్రదాయాల్లోని ప్రత్యేకతను తెలియజేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రాగౌడ్, బీఆర్ఎస్ నాయకులు హనుమంత్ రెడ్డి, బిక్షపతి రెడ్డి, కుంట లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు