27 ఏళ్ల తర్వాత కలిసిన స్నేహితులు..
* కంటతడి పెట్టిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
గరిడేపల్లి (విజయక్రాంతి): దాదాపు 27 ఏళ్ల తర్వాత కలుసుకున్న చిన్ననాటి స్నేహితులు ఆత్మీయ పలకరింపులు, ఆనంద భాష్పాలతో సందడి చేశారు. సూర్యాపేట జిల్లా(Suryapet District) గరిడేపల్లి మండలం కీతవారిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1998–99 విద్యా సంవత్సరంలో చదువుకున్న పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం గ్రామంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో భావోద్వేగాల మధ్య జరిగింది. ఒకప్పుడు ఒకే తరగతి గదిలో చదువుకుంటూ అల్లరి చేసిన స్నేహితులు.. ఇన్నేళ్ల తర్వాత కలుసుకుని పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
ఆనాటి తీపి, చేదు అనుభవాలను గుర్తుచేసుకుంటూ నవ్వుకున్నారు. వివిధ రంగాల్లో స్థిరపడిన సహచరులను చూసి ఆనందం వ్యక్తం చేశారు. తమ మధ్య లేని స్నేహితులను తలచుకుని కన్నీటిపర్యంతమయ్యారు. మరణించిన ఉపాధ్యాయులకు నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ల నుంచి వివిధ రంగాల్లో ఉన్నత హోదాల్లో స్థిరపడిన వారితో పాటు గ్రామంలో వ్యవసాయం చేసుకుంటున్న రైతులు సైతం ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు. వృత్తులు, హోదాలు వేరైనా తమ మధ్య స్నేహబంధం చెక్కుచెదరలేదని చాటుకున్నారు.
ఒకరి కుటుంబ వివరాలు మరొకరు తెలుసుకుంటూ ఆత్మీయంగా గడిపారు. ఆపదలో ఉన్న స్నేహితులకు అండగా..తమ నుంచి దూరమైన సహచర విద్యార్థుల కుటుంబాలకు పూర్వ విద్యార్థులు ఆర్థిక సాయం అందించారు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న స్నేహితులను ఆదుకునేందుకు విరాళాలు సేకరించి అవసరమైన వారికి అందించాలని నిర్ణయించారు. ఎవరికైనా ఇబ్బందులు ఎదురైతే వాట్సాప్ గ్రూపులో తెలియజేయాలని, ఆపదలో ఉన్న స్నేహితులకు అందరూ అండగా నిలవాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో పిడమర్తి అంజయ్య, పెండెం రాంబాబు, వట్టికూటి అంజయ్య, బత్తిని ఎల్లేశ్వర్, బత్తిని అంజయ్య, బత్తిని పుల్లయ్య, పాషా, సురేష్, నాగేశ్వరరావు,ఆనందబాబు, శైలజ, కనకదుర్గ, రమాదేవి, రమణ, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.