అంతర్జాతీయ వేదికపై మెరిసిన రైతు బిడ్డ
పారా త్రో బాల్లో లక్ష్మికి రజతం
ఝరాసంగం, నవంబర్ 23 : ప్రతిభకు వైకల్యం అడ్డుకాదని ఈ రైతు బిడ్డ(Child of a Farmer) నిరూపించింది. సంగారెడ్డి జిల్లా(Sangareddy District) ఝరాసంగం మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన రైతు బిడ్డ, దివ్యాంగ క్రీడాకారిణి మొగుడంపల్లి లక్ష్మి(Mogudampalli Laxmi) శ్రీలంకలో నిర్వహించిన అంతర్జాతీయ పారా త్రోబాల్ ఛాంపియన్షిప్లో(International Para Throwball Championship) భారత జట్టు తరఫున పాల్గొని రజత పతకం సాధించింది. తెలంగాణ నుంచి ఎంపికైన నలుగురు క్రీడాకారుల్లో లక్ష్మి ఒకరు . శ్రీలంక వేదికగా జరిగిన రెండో దక్షిణాసియా పారా త్రోబాల్ ఛాంపియన్షిప్లో భారత మహిళల జట్టు అద్భుత ప్రతిభ కనబరిచింది.
ఆతిథ్య శ్రీలంకతో జరిగిన ఫైనల్లో పరాజయం పాలైన చక్కని పోరాటంతో ఆకట్టుకుంది. భారత జట్టు రజత పతకం, నేపాల్ జట్టు కాంస్య పతకం సాధించాయి. ఈ విజయానికి సహకరించిన ఇండియన్ టీం కోచ్ సింగారపు బాబుకు క్రీడాకారులు కృతజ్ఞతలు తెలిపారు. కాగా నర్సాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మి అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించి రజత పతకం సాధించడం గ్రామంతో పాటు జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. ఆమె విజయం గ్రామీణ ప్రాంత దివ్యాంగ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తోంది. అంతర్జాతీయ వేదికపై జిల్లా కీర్తిని చాటిన లక్ష్మిని స్థానికులు ప్రత్యేకంగా అభినందించారు.