సిరాజ్ ఫామ్‌లో లేడు
- పిచ్ బౌలర్లకు సహకరించలేదు
- సలైవాపై నిషేధం ఎత్తేయాలి
- శుభమన్ గిల్ వ్యాఖ్యలు
వెల్లింగ్టన్, నవంబర్ 23 : కివీస్‌తో తొలి టెస్టు(First Test) కోసం మహ్మద్ సిరాజ్‌ను(Mohammed Siraj) తీసుకోకపోపడంపై వస్తున్న విమర్శలకు భారత కెప్టెన్ శుభమన్ గిల్(Shubman Gill) స్పందించాడు. తుది జట్టు ఎంపికను సమర్థించుకున్నాడు. సిరాజ్ తనకు మంచి మిత్రుడనీ, అతన్ని తప్పించడం కఠినమైన నిర్ణయంగా అభివర్ణించాడు. ఈ టెస్టు ఆరంభానికి ముందే అతనితో మాట్లాడాననీ, అతనికి చోటు ఉండదని ముందే చెప్పినట్టు వెల్లడించాడు. అయితే సిరాజ్ ప్రస్తుతం పీక్ ఫామ్‌లో లేడని గిల్ చెప్పాడు. అందుకే తుది జట్టులోకి తీసుకోలేదంటూ వివరణ ఇచ్చాడు.
ప్రస్తుతం బెస్ట్ ఫామ్‌లో ఉన్న ప్లేయర్లనే తుది జట్టులోకి తీసుకున్నామనీ చెప్పుకొచ్చాడు. ఒకవేళ మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా(Ravindra Jadeja) ఉండి ఉంటే ఈ మ్యాచ్ గెలిచేవాళ్లమని కూడా తాను అనుకోవడం లేదన్నాడు. పిచ్ బౌలర్లకు అస్సలు సహకరించనప్పుడు ఎవ్వరూ ఏమీ చేయలేరంటూ అభిప్రాయపడ్డాడు. కానీ సిరాజ్, గత 11 టెస్టుల్లో 43 వికెట్లతో ఈ డబ్ల్యూటీసీ సైకిల్లో(WTC Cycle) అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా ఉన్నాడు. ఇదిలా ఉంటే వెల్లింగ్టన్ పిచ్‌పై బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదనీ, తమ బ్యాటర్లు బాగా ఆడారనీ ప్రశంసించాడు.
చివరిరోజు కొన్ని పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతోనే డ్రాగా ముగించాల్సి వచ్చిందనీ చెప్పుకొచ్చాడు. రెండో టెస్ట్ జరిగే క్రైస్ట్‌చర్చ్ పిచ్ బౌలర్లకు సహకరిస్తుందని భావిస్తున్నట్టు చెప్పాడు. ఇక బంతిపై సలైవాను నిషేధిస్తూ ఐసీసీ తీసుకున్న నిర్ణయాన్ని ఎత్తివేయాలని కోరాడు. కరోనా సమయంలో తీసుకొచ్చిన ఈ నిబంధన ప్రస్తుతం బౌలర్లకు ఇబ్బందిగా మారిందని చెప్పాడు. ప్రస్తుతం పరిస్థితులన్నీ బాగానే ఉన్న నేపథ్యంలో ఐసీసీ దీనిపై పునరాలోచిస్తే బాగుంటుందన్నాడు.