కాంగ్రెస్ కు మా కుటుంబం 4తరాలుగా విధేయులం

03-10-2026 | 07:03pm

నల్గొండ,ఖమ్మం,వరంగల్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),అక్టోబర్ 3: కాంగ్రెస్ పార్టీకి(Congress Party) తమ కుటుంబం 4తరాలుగా విధేయులమని,తన అభ్యర్థిత్వంపై ఎలాంటి అసత్య ప్రచారాలకు(False propaganda) తావులేదని నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ(Nalgonda-Khammam-Warangal Graduate MLC) కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి(Ramreddy Sarvotham Reddy) స్పష్టం చేశారు.శనివారం అర్వపల్లిలోని శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల(Graduate MLC elections) ప్రచారం, ఓటరు నమోదు ప్రక్రియను(Voter registration process) ఆయన ప్రారంభించారు.

అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తమ కుటుంబానికి కాంగ్రెస్ తో 4 తరాలుగా అనుబంధం ఉందని,ఉమ్మడి నల్గొండ,ఖమ్మం,వరంగల్ జిల్లాల్లో తమ కుటుంబానికి సుదీర్ఘ సంబంధాలు ఉన్నాయన్నారు.తనకు అవకాశం కల్పించిన కాంగ్రెస్ అధిష్టానానికి,తన అభ్యర్థిత్వాన్ని బలపరిచిన మంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలకు కృతజ్ఞతలు తెలిపారు.తన అభ్యర్థిత్వంపై ఎలాంటి గందరగోళం,అసంతృప్తి లేదని,కాంగ్రెస్ పార్టీ అంతా ఒక్కటై తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిందని,పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని తమ కుటుంబం ఎప్పుడూ ధిక్కరించలేదని స్పష్టం చేశారు.

తనకు టికెట్ లభించడంలో దేవుడి ఆశీస్సులతో పాటు తన తండ్రి,దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఆశీస్సులు ఉన్నాయన్నారు.దామోదర్ రెడ్డి ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారని అన్నారు.అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించి,కెనడా,అమెరికాల్లో ఆసియా ఖండంలోనే అతిపెద్ద బ్యాంకుల్లో ఒకదానిలో ఉన్నత స్థాయిలో పనిచేసిన అనుభవం ఉందని,తండ్రి కోరిక మేరకు 2012 నుంచి కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పనిచేస్తున్నానని,అన్ని పార్టీల కంటే ముందుగానే కాంగ్రెస్ తనను అభ్యర్థిగా ప్రకటించిందని,అర్హత కలిగిన పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని కోరారు.

గ్రామ గ్రామాన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ హెల్ప్ లైన్ ను ప్రారంభిస్తామని వెల్లడించారు.తమ ఇంటి ఇలవేల్పు అయిన యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ప్రచారం ప్రారంభించడం ఆనందంగా ఉందని,ఈ దేవస్థాన అభివృద్ధి కోసం తమ కుటుంబం తరఫున 850 ఎకరాల భూమిని దానం చేసిన విషయాన్ని గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య,ఉపాధ్యక్షులు అనిరెడ్డి రాజేందర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దరూరి యోగానందచార్యులు,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర,జిల్లా,మండల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు