మట్టిలో మాణిక్యాలు.. శేరుపల్లి విద్యార్థులు
శ్రీరంగాపూర్, అక్టోబర్ 24: పల్లెటూర్లలో పుట్టి, ప్రభుత్వ పాఠశాలల్లో(Government School) చదువుకొని తమ ప్రతిభతో ఉన్నత విజయాలు సాధిస్తున్న వనపర్తి జిల్లా(Wanaparthy District) శ్రీరంగాపూర్ మండలంలోని శేరుపల్లి గ్రామ విద్యార్థులు(Students) మట్టిలో మాణిక్యాలని సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ కొనియాడారు. శనివారం సాహితీ కళా వేదిక ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను, వారికి మార్గదర్శకత్వం వహించిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా శంకర్ శంకర్ గౌడ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో అపారమైన ప్రతిభ దాగి ఉందని, సరైన ప్రోత్సాహం, క్రమశిక్షణ, పట్టుదలతో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని అన్నారు. చదువుతోపాటు క్రీడలపైనా ఆసక్తి పెంచుకొని అన్ని రంగాల్లో రాణించాలని విద్యార్థులకు సూచించారు. రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ (కత్తియుద్ధం) పోటీల్లో ద్వితీయ స్థానం సాధించిన సురేఖ, భువనేశ్వర్‌లోని సైనిక్ స్కూల్లో సీటు సాధించిన భార్గవ్, సీఈఓ కాలేజీలో సీటు పొందిన రూప, ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఫైనల్లో ఉత్తమ మార్కులు సాధించిన వర్షలను శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించారు.
విద్యార్థుల విజయాల వెనుక ఉపాధ్యాయుల అంకితభావం, నిరంతర కృషి ఎంతో ఉందని పేర్కొంటూ ఉపాధ్యాయులు నరసింహ, రమేష్, ఈశ్వర్ రెడ్డి, ప్రసన్నలను కూడా సన్మానించారు. గ్రామీణ విద్యార్థుల ప్రతిభను వెలికితీసి వారిని ప్రోత్సహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మేకల వెంకటయ్య, ఉపసర్పంచ్ బిచ్చన్న, ఎంఈఓ హనుమంతు, కళా వేదిక ప్రతినిధి బైరోజు చంద్రశేఖర్, రంగస్థల కళాకారుల జిల్లా అధ్యక్షుడు ఎల్. ఉమామహేశ్వర్, మొయినుద్దీన్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.