భవిత కేంద్రాల ద్వారా దివ్యాంగ పిల్లల భవిష్యత్తుకు బాటలు

02-11-2026 | 10:48pm
  1. జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
  2. వరంగల్ జిల్లాలో ఘనంగా సమ్మిళిత విద్యపై అవగాహన సదస్సు
  3. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల బాధ్యత ఎంతో కీలకమన్న కలెక్టర్
  4. దివ్యాంగుల హక్కుల చట్టం-2016పై విస్తృత చర్చ

వరంగల్, నవంబర్ 2 ( విజయ క్రాంతి): ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఆత్మవిశ్వాసంతో ఉన్నత లక్ష్యాలను సాధించేలా 'భవిత కేంద్రాల'(Bhavitha Centers) ద్వారా నాణ్యమైన విద్య, ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద(Warangal District Collector Dr. Satya Sarada) స్పష్టం చేశారు. దివ్యాంగ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు.

వరంగల్‌లోని ఆకుతోట కన్వెన్షన్ హాల్‌లో సమ్మిళిత విద్యపై ప్రత్యేక అవసరాలు గల పిల్లల తల్లిదండ్రులు, సంబంధిత వ్యక్తుల కోసం నిర్వహించిన జిల్లా స్థాయి అవగాహన మరియు శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. జిల్లా విద్యాశాఖ అధికారి ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సదస్సు అత్యంత వైభవంగా సాగింది.

పిల్లల అవసరాలను గుర్తించాలి: కలెక్టర్

ఈ సందర్భంగా కలెక్టర్ సత్య శారద మాట్లాడుతూ. ప్రత్యేక అవసరాలు గల పిల్లల మానసిక స్థితిని, అవసరాలను తల్లిదండ్రులు పూర్తిగా అర్థం చేసుకోవాలని సూచించారు. వారికి అవసరమైన సదుపాయాలు కల్పించడంలో ముందుండాలని కోరారు. సమ్మిళిత విద్యలో తల్లిదండ్రుల పాత్ర అత్యంత కీలకమని, పాఠశాల ప్రత్యేక ఉపాధ్యాయులు, ఐఈఆర్‌పీలు, ఇతర నిపుణులతో సమన్వయం చేసుకుంటూ పిల్లల ప్రగతికి కృషి చేయాలన్నారు.

స్టీఫెన్ హాకింగ్, ఐజాక్ న్యూటన్, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వంటి మేధావులు ఎన్నో శారీరక సవాళ్లను ఎదుర్కొని ప్రపంచస్థాయిలో అగ్రగామిగా నిలిచారని గుర్తుచేశారు. అలాగే, అంతర్జాతీయ క్రీడా వేదికలపై అద్భుతాలు సృష్టించి పతకాలు సాధించిన దివ్యాంగ క్రీడాకారిణి దీప్తి జీవాంజిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

దివ్యాంగుల హక్కుల చట్టం-2016 ప్రకారం. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు విద్య, ఉపాధి, ఆరోగ్యం, సామాజిక జీవనం, ప్రజా సేవల్లో సమాన హక్కులు ఉన్నాయని ఆమె గుర్తుచేశారు. సమాజంలో దివ్యాంగుల పట్ల ఉండే అపోహలు, వివక్షను పూర్తిగా తొలగించి, అన్నిరంగాల అభివృద్ధిలో వారిని భాగస్వామ్యం చేయాలని ఆకాంక్షించారు.

21 రకాల వైకల్యాల గుర్తింపునకు ప్రాధాన్యం:డీఈవో ప్రశాంత్ రెడ్డి

జిల్లా విద్యాశాఖ అధికారి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ. సమ్మిళిత విద్య ద్వారా ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సాధారణ విద్యార్థులతో సమానంగా చదువుకునే అద్భుత అవకాశాలు లభిస్తాయన్నారు. ఉపాధ్యాయులు 'ప్రశస్త్ యాప్' ద్వారా ప్రతి పాఠశాలలోనూ ప్రత్యేక అవసరాలు గల పిల్లలను ప్రారంభ దశలోనే గుర్తించి స్క్రీనింగ్ చేయాలని ఆదేశించారు. వినికిడి, దృష్టి, శారీరక, మేధో, అభ్యాస, భాషా తదితర అంశాలకు సంబంధించి గుర్తించిన 21 రకాల వైకల్యాలపై ప్రాథమిక అంచనా వేసి, వారికి తగిన వైద్య, విద్యా సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

భవిత కేంద్రాల సేవలు అభినందనీయం: డాక్టర్ కట్ల శ్రీనివాస్

కార్యక్రమ సమన్వయకర్త, ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ డాక్టర్ కట్ల శ్రీనివాస్ సదస్సులో వివరాలను వెల్లడిస్తూ. జిల్లాలో ప్రస్తుతం 18 మంది ప్రత్యేక విద్యా ఉపాధ్యాయులు, 17 మంది ఐఈఆర్‌పీలు, ముగ్గురు ఫిజియోథెరపిస్టులు సేవలు అందిస్తున్నారని తెలిపారు. ప్రతి విద్యార్థి సామర్థ్యాన్ని బట్టి వ్యక్తిగత విద్యా ప్రణాళిక రూపొందించి. చదవడం, రాయడం, ప్రాథమిక గణిత నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు.

ప్రత్యేక శిక్షణ వేళలు: సోమవారం నుంచి శుక్రవారం వరకు భవిత కేంద్రాల్లో శిక్షణ ఉంటుంది. తీవ్రమైన లేదా బహుళ వైకల్యాల కారణంగా బడికి రాలేని పిల్లలకు ఇంటివద్దనే విద్యనందించేలా ఉపాధ్యాయులు మార్గదర్శనం చేస్తారు.

సహాయక పరికరాలు: విద్యార్థులకు అవసరమైన వీల్‌చైర్లు, ట్రైసైకిళ్లు, వాకింగ్ ఎయిడ్స్, వినికిడి పరికరాలను సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి పంపిణీ చేయనున్నారు.

ఫిజియోథెరపీ సేవలు:  జిల్లాలోని ప్రతి మండలంలో వారానికి రెండుసార్లు ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ఫిజియోథెరపీ శిబిరాలు నిర్వహిస్తున్నారు.

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

సందర్భంగా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ సంతోష్ ప్రదర్శించిన నృత్యం, దివ్య బృందం ఆలపించిన పాటలు సభికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ డాక్టర్ బరుపాటి గోపి దివ్యాంగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు, వాటికి సంబంధించిన శాస్త్రీయ పరిష్కార మార్గాలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రాజారెడ్డి, విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్ మహేష్ నాయక్, డీసీసీబీ సెక్రటరీ కృష్ణమూర్తి,

ప్లానింగ్ కోఆర్డినేటర్ విజయ్ కుమార్, ఏఎస్ఓ వేణుగోపాల్, జిల్లా సైన్స్ అధికారి సురేష్ బాబు, శ్రవణ్ కుమార్, కన్వీనర్లు బి. నరసింహారావు, వి. రామకృష్ణారెడ్డి, బి. ప్రసాద్, కో-కన్వీనర్లు కృష్ణారెడ్డి, పిన్నింటి బాలాజీరావు, అనుపమ, పరమేశ్వర్, రిసోర్స్ పర్సన్లు అనిల్ కృపాకర్, నరసింహస్వామి, శ్రీనివాస్, ప్రియాంక, మహేందర్, వరలక్ష్మి, వివిధ మండలాల ఎంఈఓలు, విద్యార్థిని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, బోధనేతర సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు