కబడ్డీ టోర్నీలో వరంగల్ జట్టు విజయం
రన్నరప్‌గా నల్గొండ.. మూడో స్థానంలో నిజామాబాద్
ఖమ్మం టౌన్ నవంబర్ 24 (విజయక్రాంతి): ఖమ్మం నగరంలోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ స్టేడియంలో తెలంగాణ ట్రాన్స్‌కో, డిస్కంల ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్ సర్కిల్ కబడ్డీ టోర్నమెంట్(Kabaddi Tournament) ఘనంగా ముగిసింది. రెండు రోజులపాటు ఉత్సాహభరితంగా సాగిన ఈ పోటీల్లో వరంగల్ జట్టు విజేతగా నిలిచింది. నల్గొండ జట్టు రన్నరప్‌గా నిలవగా, నిజామాబాద్ జట్టు మూడో స్థానాన్ని దక్కించుకుంది.
రెండో రోజు జరిగిన సెమీఫైనల్ పోటీల్లో నిజామాబాద్ జట్టు నల్గొండ జట్టుతో, వరంగల్ జట్టు ఖమ్మం ట్రాన్స్‌కో జట్టుతో తలపడ్డాయి. అనంతరం జరిగిన ఫైనల్ పోటీలో వరంగల్ జట్టు అద్భుత ప్రతిభ కనబరిచి నల్గొండ జట్టుపై విజయం సాధించింది. ఖమ్మం ట్రాన్స్‌కో జట్టు నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.
ఈ కార్యక్రమానికి ఖమ్మం జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు తంబూరి దయాకర్ రెడ్డి, జిల్లా యువజన క్రీడల అధికారి తుంబూరి సునీల్ కుమార్, బాబు నాయక్, స్పోర్ట్స్ జనరల్ సెక్రటరీ డి. బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విజేత జట్లకు బహుమతులు అందజేసి అభినందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వంతోపాటు మానసిక ఉల్లాసం, క్రమశిక్షణను పెంపొందిస్తాయని అన్నారు. 50 ఏళ్లు పైబడిన ఉద్యోగులు సైతం ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొనడం అభినందనీయమని, యువతకు ఇది స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఉద్యోగులు విధి నిర్వహణతోపాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో ఎం. రాధాకృష్ణ, డీఈ దాసు, డీఈ నాగరత్నం, టెలికం విభాగం అధికారులు, విద్యుత్ శాఖ ఉద్యోగులు, వివిధ సర్కిళ్లకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు.