వికలాంగుల పట్ల మానవత్వం చూపాలి
లివింగ్ ట్రీ డిస్కవరీ హైస్కూల్ విద్యార్థుల క్షేత్ర పర్యటన
300 మందికి నిత్యావసర వస్తువుల పంపిణీ
ఆలేరు,(విజయక్రాంతి): సమాజంలో వెనుకబడిన, ఆదరణకు నోచుకోని వారిపట్ల మానవత్వం, ప్రేమ, కరుణ చూపాలని లివింగ్ ట్రీ డిస్కవరీ హైస్కూల్ డైరెక్టర్ అభిలాష కర్నాటి అన్నారు. ఆలేరు మండలం మందనపల్లికి చెందిన లివింగ్ ట్రీ డిస్కవరీ హైస్కూల్(Living tree discovery high school) విద్యార్థులు, ఉపాధ్యాయులు సోమవారం విద్యా విహార యాత్ర(Educational excursion)లో భాగంగా మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలం సంపెంబొల్లి గ్రామంలోని వికలాంగుల గృహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గృహంలో నివసిస్తున్న 300 మందికి పైగా వికలాంగులు, మానసిక ఇబ్బందులతో ఉన్నవారిని విద్యార్థులు(Students) పరామర్శించారు.
సమాజంలో వివిధ కారణాలతో కుటుంబాలకు దూరమైన వారి జీవన పరిస్థితులను విద్యార్థులకు ప్రత్యక్షంగా తెలియజేయడంతో పాటు, వారిపట్ల గౌరవం, మానవత్వం, సేవాభావం పెంపొందించడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. డైరెక్టర్ అభిలాష కర్నాటి మాట్లాడుతూ.. మనకు కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు అండగా ఉంటారని, అయితే ఇక్కడ నివసిస్తున్న వారికి అలాంటి ఆప్యాయత, ఆదరణ లేకపోవడంతో వారిని మనవంతుగా ఆదుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు. విద్యార్థులు ఉన్నతంగా చదువుకుని ప్రయోజకులైన తర్వాత వికలాంగులు, అనాథలకు సహాయం చేసే విధంగా ఎదగాలని ఆకాంక్షించారు.
ఇంట్లో తల్లిదండ్రులు పిల్లల అవసరాలను ఎప్పటికప్పుడు తీర్చుతున్నారని, ఇక్కడ ఉన్న వారికి కనీస అవసరాలు కూడా అందకపోవచ్చని విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా లివింగ్ ట్రీ డిస్కవరీ హైస్కూల్ తరఫున 300 మంది నివాసితులకు ఫెస్ట్, బ్రేస్, కొబ్బరి నూనె, సబ్బులు, ఫినాయిల్ తదితర నిత్యావసర సామగ్రిని ఉచితంగా అందజేశారు. అనంతరం విద్యార్థులు స్వయంగా వారికి భోజనం వడ్డించారు. ఉపాధ్యాయులు తమ పరిచయం, సందేశాన్ని అందిస్తూ భవిష్యత్తులోనూ తమవంతు సహాయం అందిస్తామని తెలిపారు. విద్యార్థులు, గృహంలోని నివాసితులు కలిసి నృత్యాలు చేసి ఆనందాన్ని పంచుకున్నారు. దీంతో కార్యక్రమం ఆహ్లాదకరంగా సాగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ అభిలాష కర్నాటి, ప్రధానోపాధ్యాయులు డి. రమేష్, సంజీవరావు, రాజు, శ్రీనివాస్, నాగయ్య, బాలరాజు, సరిత, స్రవంతి, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.