భూములు కోల్పోతున్న రైతులకు అండగా ఉంటాం
మాజీ మంత్రి జోగు రామన్న
ఆదిలాబాద్,(విజయక్రాంతి): భోరాజ్ మండలం(Bhoraj Mandal) కొరటా గ్రామంలో ఇండస్ట్రియల్ పార్క్(Industrial park) కోసం భూములు కోల్పోతున్న రైతులతో మాజీ మంత్రి జోగు రామన్న(Former Minister Jogu Ramanna) సమావేశమయ్యారు. గ్రామంలో రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి గోడు విన్నారు. ఈ సందర్భంగా రైతులు(Farmers) తమ ఆవేదనను మాజీ మంత్రి ముందు వెళ్లబోసుకున్నారు. చనఖా-కొరటా బ్యారేజీ ప్రధాన కాలువ ద్వారా రెండు పంటలు పండించుకునే అవకాశం ఏర్పడిందని, తరతరాల నుండి భూములను సాగు చేస్తున్నామని రైతులు తెలిపారు.
ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో భూములు లాక్కుంటే తమ బ్రతుకు పోతుందని, తమ ఇండ్లు, ఊరిని వదిలి ఎటు వెళ్లాలని ఆవేదన వ్యక్తం చేశారు. మరికొందరు రైతులు తమ సాగు భూములను మినహాయించాలని కోరుతున్నారు. మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ... ఇండస్ట్రియల్ పార్క్ లో భూములు తీసుకుంటే భూములు కోల్పోతున్న రైతుల కుటుంబాలకు ఉద్యోగం కల్పించాలని, అగ్రిమెంట్ ప్రకారం రాతపూర్వకంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రైతుల పక్షాన నిలబడి రైతులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని, ప్రభుత్వం మెడలు వంచైనా న్యాయం చేసే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. భూములు కోల్పోతున్న రైతుల దగ్గరికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఎందుకు రావడం లేదని మాజీ మంత్రి ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి వచ్చి గ్రామ సభ నిర్వహించలేదని, రైతుల అభిప్రాయం తీసుకోకుండా బలవంతంగా భూసేకరణ చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.