బతుకమ్మ వేడుకలకు చీకటి అడ్డంకి
అధికారుల నిర్లక్ష్యంపై మహిళల ఆవేదన!
బతుకమ్మ ప్రాంగణాల్లో లైటింగ్ ఏర్పాటు చేయలేదని ఆరోపణలు
సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి స్పందించకపోవడంపై విమర్శలు..
ఉన్నతాధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్
కన్నాయిగూడెం, అక్టోబర్ 10 (విజయక్రాంతి ) : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు(Telangana culture and traditions) ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను(Bathukamma celebrations) మహిళలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాల్సిన సమయంలో చీకట్లో బతుకమ్మ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడిందని కన్నాయిగూడెం మండలం ఏటూరు గ్రామపంచాయతీ(Eturu Gram Panchayat) పరిధిలోని సింగారం గ్రామ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బతుకమ్మ వేడుకలు నిర్వహించే ప్రాంగణంలో కనీసం లైటింగ్ ఏర్పాటు(Lighting arrangement) చేయకపోవడంపై పంచాయతీ అధికారుల తీరును ప్రశ్నిస్తున్నారు.
బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేందుకు గ్రామాల్లో పారిశుధ్యం, లైటింగ్ వంటి ఏర్పాట్లు చేపట్టి మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క(Seethakka) ఆదేశించినప్పటికీ, సింగారం గ్రామంలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయని మహిళలు ఆరోపిస్తున్నారు. పండుగ సందర్భంగా అవసరమైన విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని కోరినా పట్టించుకోలేదని వాపోతున్నారు. లైటింగ్ ఎందుకు ఏర్పాటు చేయలేదని పంచాయతీ కార్యదర్శిని ప్రశ్నించగా, తమకు దురుసుగా సమాధానాలు ఇచ్చారని మహిళలు ఆరోపిస్తున్నారు.
ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోవచ్చని, మంత్రి సీతక్కకు చెప్పుకున్నా తనకు సంబంధం లేదన్నట్లుగా మాట్లాడారని పేర్కొంటున్నారు. అయితే ఈ ఆరోపణలపై పంచాయతీ కార్యదర్శి వివరణ అందుబాటులోకి రాలేదు. మరోవైపు గ్రామ సర్పంచ్ సైతం బతుకమ్మ వేడుకల ఏర్పాట్లపై తగిన శ్రద్ధ చూపడం లేదని మహిళలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మహిళల పండుగకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించకపోవడం బాధాకరమని, ఈ విషయంలో మహిళా సర్పంచ్ ప్రత్యేక చొరవ తీసుకోవాల్సి ఉండేదని అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంపై సర్పంచ్ స్పందన కూడా తెలియాల్సి ఉంది.
ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి
పండుగ సమయంలో మహిళలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం జరిగిందనే ఆరోపణలపై సంబంధిత ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని గ్రామ మహిళలు కోరుతున్నారు. సింగారం గ్రామంలో బతుకమ్మ వేడుకలకు లైటింగ్ ఏర్పాటు చేయకపోవడానికి గల కారణాలపై విచారణ చేపట్టాలని, పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ బాధ్యతలను పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఆరోపణలు నిజమని తేలితే నిబంధనల ప్రకారం బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి గ్రామంలో పండుగలు ప్రశాంతంగా, సురక్షితంగా జరుపుకునేలా అవసరమైన ఏర్పాట్లు చేయడం పంచాయతీ అధికారుల బాధ్యత అని మహిళలు గుర్తుచేస్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.