అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు

15-09-2026 | 06:28pm

నార్నూర్ మండలం జామ్డ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు, గ్రామపంచాయతీ భవనం ప్రారంభం...

జిల్లా కలెక్టర్ రాజర్శి షా.

 ఉట్నూర్,(విజయక్రాంతి): నార్నూర్ మండలం(Narnoor Mandal) జామ్డ గ్రామంలో మంగళవారం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి(MLA Kova Lakshmi), జిల్లా కలెక్టర్ రాజర్షి షా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనంతో పాటు ఇందిరమ్మ ఇళ్ల(Indiramma house)ను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మరో లబ్ధిదారుడి ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ నిర్వహించి, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అర్హులైన లబ్ధిదారులకు కలెక్టర్ చేతుల మీదుగా భూమి పట్టాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామస్థాయిలో ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులభంగా, పారదర్శకంగా అందించేందుకు అవసరమైన మౌలిక వసతులను కల్పిస్తున్నామని పేర్కొన్నారు. తాగునీరు, రహదారులు, విద్యుత్ తదితర మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకుని సొంతింటి కలను సాకారం చేసుకోవాలని కోరారు.

ఎమ్మెల్యే కోవా లక్ష్మి మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకం దోహదపడుతుందని తెలిపారు. నూతన గ్రామపంచాయతీ భవనం అందుబాటులోకి రావడంతో ప్రజలకు స్థానిక పాలన, ప్రభుత్వ సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ శంకర్, హౌసింగ్ డీఈ షకీర్, ఏఈ రాకేష్, తహశీల్దార్ రాజలింగు, ఎంపీడీవో కే. పుల్లారావు, సర్పంచ్ చందర్శావ్, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు