5 September, 2026 | 5:19 AM

గిరిజన పల్లెల రోడ్లు.. బురద మయంగా..

05-09-2026 | 04:10am

* అడవి శాఖ అడ్డంగితో నిలిచిన రోడ్డు పనులు..

ఉట్నూర్, సెప్టెంబర్ 4: అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏజెన్సీ(Utnoor Agency) ప్రాంతంలోని మండలాల పరిధిలోని గ్రామాల్లో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలోని ఇంద్రవెల్లి, ఉట్నూర్, గాదిగూడ, నార్నూర్, సిరికొండ, ఆదిలాబాద్ రూరల్, తదితర మండలాల పరిధిలోని మారుమూల గ్రామాలకు ఏర్పాటు చేసిన మట్టి రోడ్లు కొద్దిపాటి వర్షానికి బురదమయం అవుతున్నాయి. దీంతో మారుమూల గిరిజన గ్రామాల ప్రజలకు కాలినడక సైతం కష్టంగా మారింది.

గత రెండు రోజులుగా కురుస్తున్న కొద్దిపాటి వర్షానికి మారుమూల గిరిజన గ్రామాల ప్రజలు బయట ప్రపంచానికి వచ్చేందుకు సాహసం చేయడం లేదు. గ్రామాల్లో అనారోగ్యానికి గురి అయిన, గర్భిణీలు, వైద్యం తో పాటు ప్రసూతి కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాలన్న కాలి నడకే శరణమవుతుంది. 2021- 22 సంవత్సరంలో గత ప్రభుత్వం మారుమూల గిరిజన గ్రామాలకు బీటీ రోడ్డు సౌకర్యం కల్పించుటకు ఉట్నూర్ ఐటిడిఏ పరిధిలోని గ్రామాలకు బీటీ రోడ్లు, వాగులపై కల్వర్టుల నిర్మాణానికి దాదాపుగా 100 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసింది.

మంజూరైన నిధులకు ఐటిడిఏ ఇంజనీరింగ్ శాఖ అధికారులు టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. కాంట్రాక్టర్లు బీటీ రోడ్డు పనులు ప్రారంభించిన సమయంలో అడవి శాఖ అధికారులు అనుమతి లేనిది రోడ్డు నిర్మించలేరని బీటీ రోడ్ల పనులను నిలిపివేశారు. దీంతో నిధులు ఉన్న రోడ్డు పనులు ముందుకు సాగలేదు.

రోడ్డు పనులను అడ్డగించిన అడవి శాఖ అధికారులపై గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులకు ప్రజాప్రతినిధులకు విన్నవించారు. అప్పటినుండి నేటి వరకు రోడ్డు పనులు పూర్తి కాలేక గిరిజనులు అవస్థలు పడుతూనే ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు శ్రద్ధ తీసుకొని బీటీ రోడ్ పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు.

800 మీటర్ల అడ్డంకి నిలిచిపోయిన రోడ్డు..

ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అసౌదా పంచాయితీ కేంద్రానికి బీటీ రోడ్ సౌకర్యం కల్పించుటకు ప్రభుత్వం రూ . 1.16 కోట్లు మంజూరు చేసింది. ఇంద్రవెల్లి మండలం బొప్పాపూర్ గ్రామం నుండి అసోద గ్రామం పంచాయతీ వరకు బీటీ రోడ్ నిర్మాణానికి కాంట్రాక్టర్ ముందుకు రాగా ఇంద్రవెల్లి మండలం బొప్పాపూర్ నుండి 800 మీటర్లు అడవి పరిధిలో ఉందని, ఇక్కడ రోడ్డు నిర్మాణానికి అనుమతి లేదని అడవి శాఖ అధికారులు పనులు నిలిపివేశారు.

దీంతో గత నాలుగేళ్లుగా పనులు నిలిచిపోయాయి. 800 మీటర్ల రోడ్డు వదిలి మిగతా రోడ్డు పనులు పూర్తి చేయాలని గిరిజనులు కోరుతున్న అధికారులు ముందుకు రావడంలేదని అసోద పంచాయతీ గిరిజనులు వాపోతున్నారు. ఐటీడీఏ పరిధిలోని చాలా గ్రామాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన అడవి శాఖ అధికారులు అడ్డంకితో రోడ్డు పనులు పూర్తి కావడం లేదు. ఇప్పటికైనా ప్రజా పాలన ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని రోడ్డు పనులు ప్రారంభించి వచ్చే వర్షాకాలంలోపు పూర్తిచేయాలని గిరిజనులు కోరుతున్నారు.

వర్షం పడితే కాలినడకే.. మెస్రం నగేష్, సర్పంచ్, అసోద, ఆదిలాబాద్ రూరల్ మండలం..

కొద్దిపాటి చినుకులు పడిన ఇంద్రవెల్లి మండలం బొప్పాపూర్ నుండి అసొద పంచాయతీ వరకు రోడ్డు పూర్తిగా బుర్దమయంగా మారుతుంది. పంచాయతీ పరిధిలోని గ్రామాల ప్రజలకు అత్యవసరంగా వైద్య సేవలతో పాటు సరుకుల కోసం కాలినడకతో రెండు కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. తమ పంచాయతీకి రోడ్డు నిర్మాణానికి మంజూరైన నిధులు ఖజానాలో మూలుగుతున్నాయి. కేవలం 800 మీటర్ల రోడ్డు పనులను అడవి శాఖ అధికారులు అడ్డుకున్నారు.

ఈ విషయం ఆ శాఖకు సబబుగా లేదని ఆవేదనతో అన్నారు. 800 మీటర్లు దాటిన తర్వాత రెండు కిలోమీటర్ల దూరం అడవి శాఖ అధికారులు తమ గ్రామానికి రావాల్సిందేనని, ఈ విషయాన్ని సైతం అధికారులు మరిచిపోతున్నారని అన్నారు. అడవి శాఖ అధికారులకు కనీసం మానవత్వం లేదని అన్నారు. తమ పంచాయతీ పరిధిలోని గర్భిణీలు అష్ట కష్టాలు పడుతున్నారని ఆవేదనతో తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

మరిన్ని వార్తలు