5 September, 2026 | 5:16 AM

పల్లె దవాఖాన ప్రారంభమెప్పుడో..?

05-09-2026 | 04:05am
  1. ప్రభుత్వ నిధులు రూ. 20 లక్షలు వృధాయేనా
  2. ఏడాదిగా ప్రజల ఎదురు చూపులు 
  3. ఇంజనీరింగ్ శాఖ నిర్లక్ష్యం ప్రజలకు శాపం 
  4. ఎమ్మెల్యే టైం ఇస్తే ఓపెనింగ్ సాధ్యమంటున్న డీఏంహెచ్‌ఓ 

లక్షేట్టిపేట, సెప్టెంబర్ 4: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య రంగానికి పెద్దపీట వేస్తూ పల్లెల్లోని పేద ప్రజలకు సైతం వైద్య సౌకర్యాలు(Medical Facilities) అందించేలా ప్రణాళిక రచించాయి. ప్రజారోగ్యమే ధ్యేయంగా ప్రతి పల్లెలో ప్రజలకు కనీస వైద్యం అందుబాటులో ఉండాలని పల్లె దవాఖాన, సబ్ సెంటర్ లను నిర్మించింది.

దీనిలో భాగంగా మండలంలోని జెండా వెంకటాపూర్ గ్రామంలో నిర్మించిన పల్లె దవాఖాన భవన నిర్మాణం పూర్తయి ఏండ్లు గడుస్తున్న సంబంధిత ఇంజనీరింగ్, వైద్య శాఖల ఉన్నతాధికారులతో పాటు పాలకులు పట్టించుకోకపో వడంతో ప్రారంభోత్సవం నేటికి నిర్లక్ష్యపు పరాకాష్టగా మిగిలిపోతోంది.

ప్రభుత్వ ధనం వృధాయేనా..?

నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో మండలంలోని 8 గ్రామాల్లో పల్లె దవాఖానలు నిర్మించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60, 40 శాతం వాటా నిధులతో ప్రతి గ్రామానికి రూ. 20 లక్షలు కేటాయించాయి. దీనిలో భా గంగా మండలంలోని దౌడేపల్లి, చందారం, లక్షేట్టిపేట, ఇటిక్యాల, తిమ్మాపూర్, జెండా వెంకటాపూర్, గుల్లకోట, కొత్తూరులలో పల్లె దవాఖాన భవనాలు నిర్మించాలి.

వీటిలో కేవలం జెండా వెంకటాపూర్ లో మాత్రమే బిల్డింగ్ నిర్మాణం పూర్తి అయ్యింది. కాగా, గుల్లకోటలో బిల్డింగ్ నిర్మాణం దాదాపుగా పూర్తి కావస్తోంది. మిగిలిన 5 బిల్డింగ్ నిర్మాణాలు ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఈ పల్లె దవాఖానలు వెంకట్రావ్ పేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మెడికల్ ఆఫీసర్ పర్యవేక్షణలో పని చేస్తాయి.

ఈ పల్లె దవాఖానలో మొదటి ప్రాధాన్యత కింద ఏంబీబీఎస్, రెండవ ప్రాధాన్యతలో బీఏఏంఎస్, మూడవ ప్రాధాన్యతలో బీఎస్సీ నర్సిం గ్ చదివిన వారు వైద్య సేవలందిచేందుకు అందుబాటులో ఉంటారు. వీరిని మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ (ఏం ఎల్ హెచ్ పీ ) అంటారు. అదే విధంగా వీరికి సహాయంగా ఒక ఏఎన్‌ఏం లేదా సెకండ్ ఏఎన్‌ఏంలతో పాటు ప్రతి వెయ్యి జనాభాకు ఒక ఆశ వర్కర్ కూడా సేవలందిస్తారు.

వైద్య సేవలకు దూరమవుతున్న ప్రజలు...

కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ (ఆమ్) లో భాగంగా నిర్మిస్తున్న ఈ భవనాలకు తెలంగాణ ప్రభుత్వం పల్లె దవాఖాన పేరుతో పలు రకాల వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. క్షేత్ర స్థాయిలో బీపీ, షుగర్, పక్షవాతం, కాన్సర్ లాంటి లక్షణాలను ప్రాథమికంగా గుర్తించి పల్లెల్లో మరణాల రేటును తగ్గించడమే లక్ష్యంగా ఇవి పని చేస్తాయి.

వ్యాధి ప్రాథమిక లక్షణాలు గుర్తించిన పల్లె దవాఖాన వైద్యులు రోగులకు తగిన ఔషదాలు అందించి, ప్రాథమిక స్థాయిలో చికిత్స సైతం అందిస్తారు. పల్లెల్లో నాన్ కమ్యూనకేబుల్ డిసిజేస్ (ఎన్సీడీ) ఒకరి ద్వారా మరొకరికి సక్రమించకుండా ముంద స్తు జాగ్రత్తలు పాటించే విధానం ఈ పల్లె దవాఖానలో ప్రధాన అంశంగా ఉంటుంది. కొన్నిసార్లు వ్యాధి తీవ్రత లక్షణాలు బట్టి మండల, జిల్లా స్థాయి ఆసుపత్రులకు మరింత మెరుగైన వైద్యం కోసం వెళ్లాలని సూచించే అవకాశం ఉంటుంది.

ముందస్తు జాగ్రత్తలతో గ్రామీణ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు పల్లె దవాఖానలు పాటుపడుతాయి. ప్రజలు అనారోగ్యానికి గురైతే మండల కేంద్రానికి లేదా జిల్లా కేంద్రానికి వెళ్లే లోపు ’ప్రాణాలు గో విందా’ అనేలా పరిస్థితి ఉందని పలువురు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దీనిపై డీఏంహెచ్‌ఓ నరేందర్ రాథోడ్ ను వివరణ కోరగా, ఇంజనీ రింగ్ శాఖ పనులు పూర్తి చేసి మాకు అప్పగిస్తే, పల్లె దవాఖాన సేవలు ప్రారంభం అవు తాయని, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సమయమిస్తే వారం రోజుల్లో ప్రారంభిస్తామ న్నారు. అందుకు విరుద్ధంగా టీజీఈడబ్ల్యూఐడీసీ అసిస్టెంట్ ఇంజనీర్ బషీర్ మాత్రం ఇప్పటికే పల్లె దవాఖాన ప్రారంభోత్సవం అ య్యిందని, మెడికల్ డిపార్ట్మెంట్ కు భవనా న్ని అప్పగించినట్లు ఇద్దరు అధికారులు పరస్పర విరుద్ధ వివరణ ఇవ్వడం కొసమెరుపు.

ఏడాదిగా భవనం ఖాళీగా ఉంటుంది... 

ఈ పల్లె దవాఖాన భవన నిర్మాణం పూర్తయి ఏడాది అయినప్పటికీ ఇంతవరకు ప్రజలకు వైద్యం అందిచ్చేందుకు ప్రారంభం చేస్తలేరు. జ్వరాలు వచ్చి మంచాన పడినప్పుడు, పొలాల్లో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు గాయాలు అయితే లక్షేట్టిపేట కు పోవాల్సి వస్తుంది. ఇక్కడ సర్పంచ్, అధికారులు పట్టించుకుని మాకు వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.

పింగళి భూమేష్, గ్రామస్థుడు

అసాంఘిక కార్యకలాపాలకు అడ్దగా మారింది... 

రాత్రి వేళల్లో కొందరు మద్యం సేవించే కేంద్రంగా ఈ పల్లె దవాఖాన అడ్డగా మారింది. గ్రామస్తుల మేలు కోరి పల్లె దవాఖాన ఓపెనింగ్ అయితే అందరికీ మంచిది. చిన్న పిల్లలు, వృద్ధులు అనారోగ్యం బారిన పడినప్పుడు చాలా కష్టం అవుతుంది. ఎమ్మెల్యే సర్ పట్టించుకుని మా దవాఖాన ఓపెనింగ్ చెయ్యాలని రెండు చేతులు జోడించి వేడుకుంటున్నాం.

అవునూరి సరోజ, స్థానికురాలు

మరిన్ని వార్తలు