పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

06-10-2026 | 11:05pm
  1. పోలీస్ స్టేషన్ పరిసరాలు, రికార్డులు, వాహనాలను పరిశీలించిన ఎస్పీ
  2. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా
  3. విజిబుల్ పోలీసింగ్‌తో ప్రజల్లో పోలీసుల పట్ల నమ్మకం, గౌరవం పెరిగేలా విధులు నిర్వహించాలి
  4. గంజాయి, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్, గ్యాంబ్లింగ్, మట్కా, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు
  5. ప్రతి గ్రామాన్ని సందర్శిస్తూ వీపీఓ విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలి
  6. గంజాయి రహిత ఆదిలాబాద్ జిల్లా నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

బేల (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్(SP Akhil Mahajan) ఐపిఎస్ బేల పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, రికార్డులు, సిబ్బంది విధులు, పోలీస్ వాహనాలను పరిశీలించి స్టేషన్ పరిధిలో నేరాల నియంత్రణ, పెండింగ్ కేసులు, సిబ్బంది విధులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలని ఎస్పీ సూచించారు. ప్రజల్లో పోలీసుల పట్ల గౌరవం, నమ్మకం పెరిగేలా నీతి, నిజాయితీ, అంకితభావంతో విధులు నిర్వహించాలని తెలిపారు.

పోలీస్ శాఖ ప్రజల భద్రత కోసం అహర్నిశలు పనిచేస్తుందనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించేలా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని సూచించారు. మహారాష్ట్రతో సరిహద్దు కలిగిన ప్రాంతం కావడంతో అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా ప్రత్యేక నిఘా కొనసాగించాలని ఎస్పీ ఆదేశించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని తెలిపారు. మండలంలో ఓపెన్ డ్రింకింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, నంబర్ ప్లేట్ లేని వాహనాలు, గంజాయి, గ్యాంబ్లింగ్, మట్కా, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా కఠినంగా పర్యవేక్షించాలని సూచించారు.

ప్రతి గ్రామాన్ని సందర్శిస్తూ విలేజ్ పోలీసింగ్ ఆఫీసర్ (VPO) విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని తెలిపారు. గ్రామాల్లో నేర పరిస్థితులు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, స్థానిక సమస్యలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. గంజాయి సాగు, విక్రయం, రవాణాను పూర్తిగా అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, గంజాయి రహిత ఆదిలాబాద్ జిల్లా నిర్మాణం లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.

సీసీటీఎన్‌ఎస్‌లో కేసులకు సంబంధించిన రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్ల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తూ క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. సమాజంలో పోలీసుల ప్రతిష్టను దెబ్బతీసేలా, పోలీసుల విధులకు ఆటంకం కలిగించేలా లేదా పోలీసులపై తిరగబడేలా ప్రవర్తించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, జైనథ్ సీఐ జి. శ్రావణ్, బేల ఎస్సై మధుకృష్ణ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు