మూడు జిల్లాల్లో రెస్టారెంట్లను తనిఖీ చేసిన టీజీ సేఫ్ ప్రత్యేక తనిఖీలు

06-10-2026 | 11:52pm

9 రెస్టారెంట్ల హోటల్ ఆహార లైసెన్స్ ల రద్దు, ఆరు హోటళ్లకు సస్పెన్షన్ నోటీసులు

5 రెస్టారెంట్లకు ఇంప్రూవ్మెంట్ నోటీసులు 

మెదక్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 10 ఎన్ఫోర్స్మెంట్ బృందాలు  తనిఖీలు

రెస్టారెంట్ల యజమానులకు షాక్ 

కామారెడ్డి, అక్టోబర్ 6 (విజయక్రాంతి): ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో మూడు జిల్లాల్లో మంగళవారం తెలంగాణ ఆహార భద్రత ప్రత్యేక అధికారులు(Telangana food safety officials) 10 బృందాల తో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు.

మెదక్, నిజామాబాద్, కామారెడ్డి, జిల్లాలోని 44వ జాతీయ రహదారి వెంట ఉన్న రెస్టారెంట్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి యజమానులకు  షాక్ చూపించారు. పలు రెస్టారెంట్లలో టీజీ సేఫ్ ప్రత్యేక అధికారుల బృందాలు తనిఖీలు చేసి 9 రెస్టారెంట్ల రైసెన్సులను రద్దు చేశారు. మరో ఆరు రెస్టారెంట్ల ఆహార లైసెన్సులు సస్పెన్షన్‌ చేశారు. మరో ఐదు సంస్థలకు ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ చేశారు. ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకునేలా తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (టీజీ సేఫ్) ఆధ్వర్యంలో 44వ జాతీయ రహదారి వెంట ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.

టీజీ సేఫ్‌కు చెందిన 10 ఎన్ఫోర్స్మెంట్ బృందాలు మెదక్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో మొత్తం 20 రెస్టారెంట్లను ఆహార సంస్థలను తనిఖీ చేశారు. కామారెడ్డి జిల్లాలో 44వ జాతీయ రహాదారి వెంట 8 రెస్టారెంట్లను తనిఖీ చేశారు. తనిఖీల సందర్భంగా జైకా మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్ (బస్వాపూర్), ది మాల్గుడి రెస్టారెంట్ (అంతంపల్లి, భిక్నూర్),  వసుధ ఫ్యామిలీ రెస్టారెంట్ (భిక్నూర్), న్యూ ఉడిపి కృష్ణ భవన్ (అడ్లూర్), లుఫ్యాన్స్ ఫ్యామిలీ రెస్టారెంట్ (అడ్లూర్ ఎల్లారెడ్డి), తాజ్ ఫ్యామిలీ దాబా (సదాశివనగర్) లో పరిశుభ్రత లోపాలు, ఆహార పదార్థాల సక్రమ నిల్వ లేకపోవడం, కీటకాల ఉనికి, గడువు ముగిసిన ఆహార పదార్థాలు, వంటగది అపరిశుభ్రత తదితర తీవ్రమైన ఉల్లంఘనలు గుర్తించారు. దీంతో ఆయా సంస్థల ఆహార లైసెన్సులను సస్పెండ్ చేసి, వ్యాపార కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించారు.

శ్రీ ఆధ్య గ్రాండ్ మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ (జంగంపల్లి) కు షోకాజ్ నోటీసు జారీ చేసి జరిమానా విధింపునకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.  ఆర్.ఎస్. గ్రాండ్ రెస్టారెంట్ (నర్సన్నపల్లె)కు లోపాలను సరిదిద్దుకోవాలని ఇంప్రూవ్మెంట్ నోటీసు జారీ చేశారు. పునః తనిఖీ అనంతరం తదుపరి చర్యలు తీసుకోనున్నారు.

మూడు జిల్లాల్లో నిర్వహించిన తనిఖీల్లో కల్తీ అనుమానంతో 21 ఆహార నమూనాలను సేకరించినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 9 సంస్థల లైసెన్సులు సస్పెండ్ చేయగా, 6 సంస్థలకు షోకాజ్ నోటీసులు, 5 సంస్థలకు ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ చేశారు. ఇందులో కామారెడ్డి జిల్లాలో 6 సంస్థల లైసెన్సులు సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఆహార వ్యాపార సంస్థలు తప్పనిసరిగా ఆహార భద్రతా ప్రమాణాలను పాటిస్తూ పరిశుభ్రమైన వాతావరణంలో ఆహారాన్ని తయారు చేసి విక్రయించాలని టీజీ సేఫ్ అధికారులు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు