ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగార్థులకు ఉచిత మాక్ టెస్ట్‌లు
సిద్దిపేట క్రైం, అక్టోబర్ 6 (విజయక్రాంతి): పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు మద్దతుగా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్(Siddipet Police Commissionerate) కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే ప్రిలిమ్స్/సబ్జెక్ట్ పరీక్షల్లో విజయం సాధించడంలో సహాయపడటానికి, ఉచితంగా మాక్ టెస్ట్‌లు, ఆన్‌లైన్ మెంటార్‌షిప్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
ఈ సదుపాయం ద్వారా అభ్యర్థులు పరీక్షా విధానంపై అవగాహన పెంచుకోవడమే కాకుండా, తమ ప్రిపరేషన్ స్థాయిని పరీక్షించుకోవడానికి, తప్పులను సరిదిద్దుకోవడానికి మంచి అవకాశమని సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. ఎస్ఐ అభ్యర్థులకు అక్టోబర్ 10 నుంచి నవంబర్ 15 వరకు అయిదు, కానిస్టేబుల్ అభ్యర్థులకు అక్టోబర్ 11 నుంచి డిసెంబర్ 13 వరకు 10 మాక్ టెస్ట్‌లు ఉంటాయి. ఆన్‌లైన్ మెంటార్‌షిప్ ద్వారా అనుభవజ్ఞులైన పోలీస్ అధికారులు అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో ప్రత్యేక మార్గదర్శకత్వం అందిస్తారు.
పరీక్షా వ్యూహం, సమయ నిర్వహణ, మాక్-టెస్ట్ పై విశ్లేషణ, తప్పులను గుర్తించి సరిదిద్దుకోవడం, ప్రిపరేషన్ పై మార్గదర్శకాలు వివరిస్తారు. అభ్యర్థులు అక్టోబర్ 8 వరకు పోస్టర్‌లోని క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చని సూచించారు. సిద్దిపేట పోలీస్ అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో లింక్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చని తెలిపారు.