డ్రగ్స్‌కు నో.. జీవితానికి ఎస్‌: గవర్నర్‌

06-10-2026 | 06:21pm

మెదక్‌: డ్రగ్స్‌ మహమ్మారిని అరికట్టేందుకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని గవర్నర్‌ శివప్రతాప్ శుక్లా(Governor Shiv Pratap Shukla) పిలుపునిచ్చారు. మెదక్‌ కలెక్టరేట్‌లో నిర్వహించిన నషాముక్త్‌ భారత్‌(Nasha Mukt Bharat) కార్యక్రమంలో ఆయన పాల్గొని డ్రగ్స్‌ వ్యతిరేక అవగాహన(Drug Awareness) ర్యాలీని ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ‘డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి అవును చెప్పండి’ అంటూ గవర్నర్‌ ప్రజలకు సందేశం ఇచ్చారు. డ్రగ్స్‌ దుష్ప్రభావాలపై అవగాహన కల్పించే పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

2029 నాటికి డ్రగ్స్‌ రహిత భారతదేశాన్ని నిర్మించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని గవర్నర్‌ తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. తెలంగాణను కూడా నిర్ణీత గడువు కంటే ముందే డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా(Telangana Drug Free State) మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. డ్రగ్స్‌ అక్రమ రవాణా, వినియోగాన్ని అడ్డుకునేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.

డ్రగ్స్‌ వ్యతిరేక పోరాటంలో మీడియా కీలక పాత్ర పోషించాలని, గ్రామస్థాయి వరకు అవగాహన కార్యక్రమాలను విస్తరించాలని గవర్నర్‌ సూచించారు. ప్రజలు, పోలీసులు, ప్రభుత్వం, మీడియా సమష్టిగా పనిచేస్తే నషాముక్త్‌ భారత్‌ లక్ష్యాన్ని సాధించవచ్చని అన్నారు. మెదక్‌ పర్యటనలో గవర్నర్‌కు మంత్రి వివేక్‌ వెంకటస్వామి, ఎంపీ రఘునందన్‌రావు తదితరులు స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్‌ స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘శక్తి’ స్టాళ్లను సందర్శించారు.

మరిన్ని వార్తలు