గ్యాస్ ఏజెన్సీ బండ పై బాదుడు!

16-09-2026 | 05:53pm

గ్యాస్ వినియోగదారుల నెత్తిన అదనపు భారం..

ప్రతి గ్యాస్ సిలిండర్‌పై అదనంగా రూ.100 నుంచి రూ.200 వసూళ్లు?..

వినియోగదారుల ఆరోపణలతో గ్యాస్ కనుగోలకు ప్రయత్నించిన విజయక్రాంతి ప్రతినిధి దగ్గర సైతం అధిక వసూళ్లు....

కఠిన చర్యలు తీసుకోవాలని వినియోగదారుల డిమాండ్...

సింగరేణి సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): ఇల్లెందుకు చెందిన గ్యాస్ ఏజెన్సీ వాహనాలు(Gas Agency Vehicles) గ్యాస్ సిలిండర్ పంపిణీ సమయంలో నిర్ణయించిన ధరకు అదనంగా నగదు వసూలు చేస్తున్నారంటూ కొందరు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఒక్కో సిలిండర్‌పై సుమారు రూ.100 నుంచి రూ.200 వరకు అదనంగా చెల్లించాల్సి వస్తోందని వారు పేర్కొంటున్నారు.

గ్యాస్ సిలిండర్ ధరతో పాటు అదనపు మొత్తాన్ని చెల్లించాల్సి వస్తున్నట్లు కొందరు వినియోగదారులు చెబుతున్నారు. దీంతో సామాన్య వినియోగదారులపై అదనపు ఆర్థిక భారం పడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆరోపణలపై వాస్తవ పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా గ్యాస్ సిలిండర్ కొనుగోలుకు వెళ్లిన విజయక్రాంతి ప్రతినిధి వద్ద కూడా అదనపు వసూళ్లను అడగడం గమనార్హం.

రశీదులపై స్పష్టత అవసరం

సిలిండర్ ధరకు అదనంగా ఏదైనా మొత్తం వసూలు చేస్తే దానికి అధికారిక రశీదు ఇస్తున్నారా? ఆ మొత్తాన్ని ఏ నిబంధనల ప్రకారం వసూలు చేస్తున్నారు? అనే అంశాలపై సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వాలని వినియోగదారులు కోరుతున్నారు. అలాగే గ్యాస్ బుక్కులపై ధరలు రాయకుండా సంతకాలతో సరిపెట్టుకుంటున్నారు. దీనిపై సమగ్ర విచారణ చేసి వారు వసూలు చేస్తున్న ధరలను గ్యాస్ బుక్కుపై నమోదు చేయవలసి ఉంది, దానిని తుంగలో తొక్కుతూ వారికి ఇష్టానుసారంగా వసూళ్లను రాబడుతున్నారు.

విచారణకు డిమాండ్

వినియోగదారుల నుంచి అదనపు వసూళ్లు చేస్తున్న గ్యాస్ ఏజెన్సీపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పలువురు అభిప్రాయ పడుతూన్నారు.

మరిన్ని వార్తలు