ఆదివాసీ హక్కులపై జాక్ గర్జన
ఏజెన్సీ చట్టంపై గిరిజనేతరులు వేసిన కేసుపై కౌంటర్ దాఖలు చేయాలి
జీవో నెంబర్ 3, జీవో నెంబర్ 29 కలిపి ప్రత్యేక చట్టం అమలు చేయాలి
ఆదివాసి సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్
భద్రాద్రి కొత్తగూడెం, (విజయక్రాంతి): ఆదివాసీ హక్కులు(Tribal Rights), చట్టాల పరిరక్షణ కోసం ఆదివాసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (Joint Action Committee of Adivasi Organizations) ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. జీవో నంబర్ 3, 29లను కలిపి ప్రత్యేక చట్టం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
1/70 చట్టంపై గిరిజనేతరులు దాఖలు చేసిన కేసులో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని జాక్ నాయకులు కోరారు. ఏజెన్సీ పరిధిలోని శాఖల్లో గిరిజన నిరుద్యోగ యువత(Unemployed tribal youth)కు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు, షెడ్యూల్ ఏరియా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రత్యేక పబ్లిక్ సర్వీస్ కమిషన్(Scheduled Area Public Service Commission) ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
1/70, పీసా, ఆర్‌ఓఎఫ్‌ఆర్ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని నాయకులు కోరారు. హైదరాబాద్‌లో హత్యకు గురైన ఆదివాసీ యువతి శిరీష కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు, ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
దాదాపు రెండు గంటల పాటు కొనసాగిన ధర్నాతో ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కలెక్టర్ వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని జాక్ నాయకులు స్పష్టం చేశారు. అనంతరం డీఆర్వో సుజాత అక్కడికి చేరుకుని కలెక్టర్ అనారోగ్యంతో ఉన్న విషయాన్ని వివరించినప్పటికీ, తమ డిమాండ్లపై స్పష్టత వచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని నాయకులు తెలిపారు.