గోపా ప్రతిభా పురస్కారం అందుకున్న మణికంఠ సాయి
టేకులపల్లి, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలానికి చెందిన అంబాల మణికంఠ సాయి(Ambala Manikanta Sai) పదవ తరగతిలో 555 మార్కులు సాధించి ప్రతిభ చూపినందుకు గాను గోపా ప్రతిభా పురస్కార అవార్డును అందుకున్నాడు. ఆదివారం ఖమ్మంలోని లయన్స్ క్లబ్ భవనంలో జరిగిన గోపా ప్రతిభా పురస్కారాల సభలో ఖమ్మం జిల్లా గోపా అధికారులు, ప్రొఫెషనల్స్ అసోసియేషన్(GOPA) ఆధ్వర్యంలో మణికంఠ సాయిని శాలువాతో సన్మానించి, మెమెంటో, సర్టిఫికేట్ అందజేసి సత్కరించారు.
ఈ సందర్భంగా గోపా పెద్దలు మాట్లాడుతూ.. పదవ తరగతిలో 555 మార్కులు సాధించడం చాలా గొప్ప విషయమని, మణికంఠ సాయి మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని, ఇతర గౌడ విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. అవార్డు అందుకున్న అనంతరం మణికంఠ సాయి మాట్లాడుతూ.. ఈ అవార్డు తన ఒక్కడిది కాదని, తనను కష్టపడి చదివిస్తున్న తల్లిదండ్రులది, చదువు చెప్పిన గురువులది అని అన్నారు. గోపా వారు ఇచ్చిన ఈ ప్రోత్సాహాన్ని ఎప్పటికీ మర్చిపోనని, సర్దార్ సర్వాయి పాపన్న గారి స్ఫూర్తితో బాగా చదివి మన గౌడ జాతికి మంచి పేరు తెస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గోపా పెద్దలు, అధికారులు, విద్యార్థి తల్లిదండ్రులు, టేకులపల్లి మండల ప్రజలు, గౌడ కులస్తులు పాల్గొని మణికంఠ సాయికి శుభాకాంక్షలు తెలిపి ఆనందం వ్యక్తం చేశారు.