రాత్రి వేళల్లో పామాయిల్ గెలల దొంగతనం.. ముగ్గురు అరెస్ట్
దమ్మపేట, అక్టోబర్ 06 (విజయక్రాంతి): మండల పరిధిలోని పామాయిల్ తోటలను రాత్రి వేళల్లో లక్ష్యంగా చేసుకుని పామాయిల్(Palm Oil) గెలలను అక్రమంగా నరికి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను దమ్మపేట పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ట్రాలీ ఆటో, మూడు సెల్‌ఫోన్లు, రూ.20,000 నగదును స్వాధీనం చేసుకున్నారు.
దమ్మపేటకు చెందిన పిల్లి వెంకటేశ్వరరావు (45) రాత్రి సమయాల్లో తన ఏ పి 20 టీ ఎ 9724 గల అప్పి ట్రాలీ ఆటోలో పామాయిల్ తోటల్లోకి ప్రవేశించి గెలలను నరికి తరలించేవాడు. అనంతరం దొంగిలించిన గెలలను అశ్వారావుపేటలోని పామాయిల్ ఫ్యాక్టరీలో విక్రయించేందుకు పెరుమాళ్ల కుమార్ బాబు (27) సహకరించేవాడు.
అదేవిధంగా చిట్లూరి పుల్లారావు (41) తన పేరుతో ఉన్న ఎఫ్ కోడ్ ఎఫ్ ఎల్ 0156 ద్వారా దొంగిలించిన పామాయిల్ గెలలను ఫ్యాక్టరీలో విక్రయించేందుకు సహకరించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. గెలల విక్రయం ద్వారా వచ్చిన నగదును ముగ్గురూ పరస్పరం పంచుకునేవారని పోలీసులు తెలిపారు. దర్యాప్తులో భాగంగా సెప్టంబర్ 06, 08, 10 తేదీల్లో పార్కలగండి గ్రామ శివారు, మొద్దులగూడెం గ్రామ శివారు తదితర ప్రాంతాల్లోని పామాయిల్ తోటల్లో దొంగతనాలకు పాల్పడినట్లు నిందితులు వెల్లడించారు. దొంగిలించిన పామాయిల్ గెలల విక్రయం ద్వారా సుమారు రూ.20,000 వచ్చినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.
నిందితులు నగదు లావాదేవీలతో పాటు ఫోన్ పే ద్వారా కూడా డబ్బు బదిలీలు నిర్వహించినట్లు దర్యాప్తులో గుర్తించారు. స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లలోని డిజిటల్ లావాదేవీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. కేసుకు సంబంధించి మరిన్ని వివరాలపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఈ కేసు ఛేదనలో అశ్వారావుపేట సీఐ పి. నాగరాజు రెడ్డి, దమ్మపేట ఎస్‌ఐలు బి. రాజేష్ కుమార్, డి. బాలస్వామినాధం, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కేసు ఛేదనలో కీలకంగా పనిచేసిన పోలీస్ సిబ్బంది లక్ష్మణ్, రామకృష్ణ రెడ్డిలను సీఐ పి. నాగరాజు రెడ్డి అభినందించారు.