బోడులో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
పూల పండుగలో ఆటపాటలతో సందడి చేసిన మహిళలు
టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి మండలం(Tekulapalli Mandal) బోడు గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలను(Bathukamma celebrations) మహిళలు ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను గ్రామంలోని ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేసి, సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మల చుట్టూ వలయంగా చేరి, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను(Telangana culture and traditions) ప్రతిబింబించే పాటలు పాడుతూ ఉత్సాహంగా ఆటపాటలతో సందడి చేశారు.
పూల పండుగగా పేరొందిన బతుకమ్మ వేడుకలు గ్రామంలో పండుగ వాతావరణాన్ని నింపాయి. మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొనడంతో గ్రామంలో సందడి నెలకొంది. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ప్రేమకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఐకమత్యంతో జరుపుకోవడం ఆనందంగా ఉందని గ్రామస్తులు పేర్కొన్నారు. అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేసి పండుగను ముగించారు.